Share News

Amaravati Mining Scam: అమరావతిలో గలీజు పని

ABN , Publish Date - May 20 , 2025 | 04:08 AM

అమరావతిలోని సీఆర్‌డీఏ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓ కీలక గనులశాఖ అధికారి తన తోడల్లుడికి మైనింగ్ లీజు ఇప్పించేందుకు ప్రయత్నించాడు. ఉన్నతాధికారి బ్రేక్ వేయడంతో వ్యవహారం సీఎంఓ దాకా వెళ్లి, సంబంధిత అధికారికి షోకాజ్ జారీ చేశారు.

Amaravati Mining Scam: అమరావతిలో గలీజు పని

  • అడ్డగోలుగా లీజు కొట్టేయాలని గనుల శాఖ కీలక వ్యక్తి మంత్రాంగం

  • నిబంధనలకు భిన్నంగా సీఆర్‌డీఏ జోన్‌లో తోడల్లుడికి మైనింగ్‌ లీజుకు యత్నం

  • గుంటూరులోని అధికారి ద్వారా ప్రతిపాదన

  • ఉన్నతాధికారి బ్రేక్‌.. సీఎంఓకు నివేదిక

  • సీఎంఓ ఆదేశాలతో అధికారికి షోకాజ్‌

  • ఉన్నతాధికారిపై కీలక వ్యక్తి ఆగ్రహం

  • మరోసారి సీఎంఓకు చేరిన పంచాయితీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నుల శాఖలోని ఓ కీలక వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా తన తోడల్లుడికి అమరావతిలో మైనింగ్‌ లీజు ఇప్పించాలని ప్రయత్నించారు. ఈ ప్రతిపాదనకు ఓ ఉన్నతాధికారి బ్రేక్‌ వేయడంతో విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్లింది. ప్రతిపాదన పంపిన అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌కు భారీ డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మైనింగ్‌ లీజులను అమరావతి నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీలకు ఇచ్చేలా, వాటికి మాత్రమే మెటీరియల్‌ పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పనుల్లో వేగం పెరిగాక రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌ కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసి కూడా గనుల శాఖలోని కీలక వ్యక్తి తన తోడల్లుడికి మైనింగ్‌ లీజు ఇప్పించాలని చూశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ అధికారితో ఈ మేరకు ప్రతిపాదన పంపించారు. ఇది చూసి గనుల శాఖ ఉన్నతాధికారి కంగుతిన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. లీజు ప్రతిపాదన వ్యవహారంలో కీలక వ్యక్తి వద్ద మొన్నటి వరకు పనిచేసిన ఓ రిటైర్డ్‌ అధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం.


నిబంధనలు ఉల్లంఘించి..

అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్క్‌ల కోసం భారీగా రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలో మైనింగ్‌ లీజులు, ప్రత్యేకించి రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో, ప్రత్యేకంగా సీఆర్‌డీఏ జోన్‌లో అమరావతి నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీలకే లీజులు లేదా సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా నామినేషన్‌ ప్రాతిపదికన ఇవ్వాలని ఆదేశించింది. దీని ప్రకారం అమరావతి నిర్మాణ పనులు చేయని కంపెనీలకు, వ్యక్తులకు మైనింగ్‌ లీజులు, సబ్‌ లీజులు ఇవ్వడానికి వీల్లేదు. అయినా గనుల శాఖలోని కీలక వ్యక్తి తన తోడల్లుడికి అమరావతిలో సివిల్‌ వర్క్‌లు ఇప్పించాలనుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని రోడ్‌మెటల్‌, గ్రావెల్‌ లీజులను తోడల్లుడికి చెందిన కంపెనీకి ఇవ్వాలని గుంటూరు గనుల అధికారి వద్ద దరఖాస్తు ఇప్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కంపెనీకి నామినేటెడ్‌ ప్రాతిపదికన లీజులు ఇచ్చే అవకాశమే లేదు. కనీసం ఆ కంపెనీ దరఖాస్తును కూడా స్వీకరించకూడదు. కానీ గనుల అధికారి అవేవీ పాటించలేదు. దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని, ఆ కంపెనీకే 22-1లోని లీజులు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అయితే ఆ కంపెనీ అమరావతి పరిధిలో ఏ వర్క్‌లు చేస్తుందో పొందుపరచలేదు. ఈ ప్రతిపాదనపై అనుమానం వచ్చి గనుల ఉన్నతాధికారి సమగ్ర విచారణ చేశారు. సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. తొలుత నిబంధనల ప్రకారమే పంపించానని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి గనుల శాఖలో కీలక వ్యక్తి వద్ద మొన్నటి వరకు పనిచేసిన రిటైర్డ్‌ అధికారి ఒత్తిడి మేరకే ప్రతిపాదించినట్లుగా అసలు విషయం నివేదించారు.


కీలక వ్యక్తి వర్సెస్‌ ఉన్నతాధికారి

మైనింగ్‌ లీజు ప్రతిపాదనలో పెద్దల పాత్ర ఉండటంతో అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో గోల్‌మాల్‌ ఉందని, వెంటనే సంబంధిత అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సీఎంవో ఆదేశించింది. అమరావతిలో వర్క్‌లు చేసే కంపెనీలకే లీజులు ఇవ్వాలని, బయటి వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని అధికారులు ఆదేశించారు. సీఎంవో ఆదేశాల మేరకు గనుల శాఖ గుంటూరులో ఉన్న సదరు అధికారికి షోకాజ్‌ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా లీజు ప్రతిపాదన ఎందుకు పంపించారు? మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ అధికారికి నోటీసివ్వడం గనుల శాఖలోని కీలక వ్యక్తికి ఆగ్రహం తెప్పించింది. తనకు తెలియకుండా నోటీసు ఎలా ఇస్తారంటూ ఆ శాఖ ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి నిలదీసినట్టు తెలిసింది. ‘సీఆర్‌డీఏ పరిధిలో అమరావతి వర్క్‌లు చేసే కంపెనీలకే లీజులివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ అధికారి ప్రతిపాదన పంపించారు. సీఎంవో ఆదేశాల మేరకే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది’ అని ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. అయినా కీలక వ్యక్తి శాంతించలేదని తెలిసింది. దీంతో ఈ వ్యవహారం పంచాయితీగా మారి మరోసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. కీలక వ్యక్తి వద్ద పనిచేసిన రిటైర్డ్‌ అధికారి వ్యవహారం మరోసారి చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆయన సిఫారసుల పేరిట వివిధ జిల్లాల నుంచి వచ్చిన లీజు ప్రతిపాదనలను పున:పరిశీలన చేయాలని గనుల శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - May 20 , 2025 | 04:09 AM