Share News

Power Tariff Hike: అంతు చిక్కని ట్రూఅప్‌ లెక్క!

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:29 AM

విద్యుత్‌ చార్జీల బాదుడుకు పెట్టిన ముద్దు పేరు ట్రూ అప్‌ అంటే... ఒక సంవత్సరంలో అదనంగా పడిన

Power Tariff Hike: అంతు చిక్కని ట్రూఅప్‌ లెక్క!

జగన్‌ జమానా భారం...

వైసీపీ హయాంలో 2019-20 నుంచి 24-25 దాకా రూ.వేల కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం మోపారు. జనం గగ్గోలు పెట్టినా 2023-24, 24-25 సంవత్సరాల్లోనూ భారీగా రూ.19,950 కోట్ల మేర ట్రూ-అప్‌ చార్జీల భారాన్ని జగన్‌ హయాంలో ప్రతిపాదించారు. ఎన్నికలకు ముందు భారీగా వసూలు చేస్తే జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంటుందనే ఉద్దేశంతో... ఎన్నికలు ముగియగానే రూ.15,169 కోట్ల విద్యుత్‌ భారం మోపేందుకు డిస్కమ్‌లకు ఈఆర్‌సీ అనుమతి లభించింది. ఇప్పుడూ... 2019-25 నడుమ రెవెన్యూ లోటు పేరుతో ఇంకో 12,717 కోట్లను ట్రూఅప్‌ చార్జీల కింద వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటామని డిస్కంలు పేర్కొనడం, దీనిపై ఈఆర్‌సీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం గమనార్హం.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల బాదుడుకు పెట్టిన ముద్దు పేరు ‘ట్రూ అప్‌’! అంటే... ఒక సంవత్సరంలో అదనంగా పడిన భారాన్ని లెక్కించి, దానిని తదుపరి ఏడాది నుంచి వసూలు చేస్తారన్న మాట! ఇలా జగన్‌ హయాంలో ప్రతిఏటా ‘ట్రూ అప్‌’ పేరుతో బాదారు. జగన్‌ జమానా పోయినా... అప్పటి భారాన్ని జనం భరిస్తూనే ఉన్నారు. ఇది సరిపోదంటూ... 2019-20 నుంచి 2024-25 వరకు ఐదేళ్లకూ కలిపి రూ.12,717 ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేసుకుంటామంటూ డిస్కమ్‌లు విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్‌సీ)కు ప్రతిపాదనలు పంపించాయి. ఎప్పటికప్పుడు లెక్కలు తీసి బాదుతూనే... మళ్లీ ఐదేళ్లకు కలిపి మరో బాదుడు ఏంటని అసలు ప్రశ్న! అదేమిటంటే... ఐదేళ్లలో వచ్చిన రెవెన్యూ లోటును ఇప్పుడు వసూలు చేసుకుంటామని డిస్కమ్‌లు అంటున్నాయి. ఈ లెక్కలను అప్పుడు చూపించలేదని, ఇప్పుడు ఆ భారాన్ని వసూలు చేసుకుంటామని వింత వాదన చేస్తున్నాయి. జగన్‌ జమానాలో విచ్చలవిడిగా ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు, ఇతర పరికరాలను అధిక ధరలకు కొనుగోలు చేసిన ఫలితం ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు శాపంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. 2019-20 నుంచి 2024-25 మధ్య రూ.12,717 కోట్ల మేర ట్రూఅప్‌ భారంపై ఈఆర్‌సీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఇది ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే డిస్కంలకు ఆ మొత్తా న్ని తానే చెల్లించాలి. లేకపోతే ఈ భారాన్ని ప్రజలపై వేయాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్‌ జమానా భారం రూ.15 వేల కోట్లను గత ఏడాది నుంచీ ట్రూ-అప్‌ చార్జీల రూపంలో కడుతున్న జనంపై.. ఇంకో 12,717 కోట్ల భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈఆర్‌సీ నోటీసుకు ఈ నెల 29న సమాధానం ఇస్తామని.. జనంపై ఎలాంటి భారం పడకుండా వచ్చే ఏడాది ఆదాయ వ్యయ నివేదికలో సర్దుబాటు చేసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఇంత పెద్దమొత్తం ఎలా సర్దుబాటు చేసుకుంటారని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సందేహం లేవనెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:29 AM