Share News

Operation Kagar: తగ్గుతున్న మావోయిస్టుల ప్రభావం

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:06 AM

దేశంలో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి తొమ్మిది రాష్ట్రాల్లో 46 నక్సల్‌ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 38కి తగ్గింది.

Operation Kagar: తగ్గుతున్న మావోయిస్టుల ప్రభావం

  • 11కు పడిపోయిన వామపక్ష తీవ్రవాద ప్రభావ జిల్లాలు

  • ఎస్‌ఆర్‌ఈ పరిధిలోని జిల్లాలు 46 నుంచి 38కి తగ్గుదల

న్యూఢిల్లీ, నవంబరు 2: దేశంలో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి తొమ్మిది రాష్ట్రాల్లో 46 నక్సల్‌ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 38కి తగ్గింది. వీటిలో ఆందోళనకరమైన జిల్లాలు 4, అత్యంత ప్రభావిత జిల్లాలు 3 మాత్రమే ఉన్నాయని తాజాగా వర్గీకరించారు. అత్యంత ప్రభావిత జిల్లాలు (బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, సుకుమా) అన్నీ ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నాయి. ఇక ఆందోళనకరమైన జిల్లాలు కాంకేర్‌ (ఛత్తీస్‌గఢ్‌), వెస్ట్‌ సింగ్‌భూమ్‌(జార్ఖండ్‌), బాలాఘాట్‌(మధ్యప్రదేశ్‌), గడ్చిరోలి(మహారాష్ట్ర)గా గుర్తించారు. ఈ వర్గీకరణను అక్టోబరు 15న కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. వాపమక్ష తీవ్రవాదాన్ని (ఎల్‌డబ్ల్యూఈ) ఎదుర్కోవడానికి కేంద్రం 2015లో జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది.

దీనిలో భాగంగా మావోయిస్టులతో పోరాడేందుకు రాష్ట్రాలతో కలసి పనిచేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించడం, కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు సాయం చేసేందుకు సెక్యూరిటీ రిలేటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌ (ఎస్‌ఆర్‌ఈ) పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. నక్సల్స్‌ అణచివేతలో గణనీయమైన మెరుగుదల నమోదైందని, 2025 ఏప్రిల్‌ 1న 46గా ఉన్న ఎస్‌ఆర్‌ఈ పరిధిలోకి వచ్చే జిల్లాల సంఖ్య ఇప్పుడు 38కి తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలు ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించిన తర్వాత నక్సల్స్‌ హింస, దాని ప్రభావానికి సంబంధించిన గ్రాఫ్‌ పడిపోయిందని పేర్కొన్నాయి.


ఈ ఏడాది ఏప్రిల్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావం 18 జిల్లాల్లో ఉండగా ఇప్పుడు 11కి పడిపోయింది. వీటిని మూడు విభాగాలుగా వర్గీకరించారు. ‘ఇతర ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాల’ విభాగంలో దంతెవాడ, గరియాబంద్‌, మోహ్లా-మన్‌పూర్‌-బందర్‌బాగ్‌ చౌకీ (ఛత్తీస్‌గఢ్‌), కంధమాల్‌ (ఒడిశా) ఉన్నాయి. అదేవిధంగా ‘లెగసీ అండ్‌ థ్రస్ట్‌ జిల్లాలు’ విభాగంలో ఒడిశా నుంచి 8, ఛత్తీస్‌గఢ్‌- 6, బిహార్‌- 4, జార్ఖండ్‌-3, తెలంగాణ -2, ఏపీ -1. మధ్యప్రదేశ్‌-1, మహారాష్ట్ర-1, పశ్చిమ బెంగాల్‌-1 చొప్పున మొత్తం 27 జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నక్సలిజం అంతమైనప్పటికీ, వామపక్ష తీవ్రవాదం విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలుగా భావిస్తున్నందున వీటికి నిరంతర కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని తాజా నివేదిక పేర్కొంది.


మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌: షా

2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ‘‘ఒకప్పుడు మావోయిజాన్ని వ్యాప్తి చేసేవారు రెడ్‌ కారిడార్‌ గురించి మాట్లాడేవారు. దేశవ్యాప్తంగా 130కి పైగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 11కి పరిమితమైంది. చాలామంది మావోయిస్టులు మరణించారు... కొందరు అరెస్టయ్యారు. మరికొందరు లొంగిపోయారు. ఈ హింసాత్మక ఉద్యమం వెన్నెముక విరిగిపోయిదని భావిస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్టులు 6నెలలు మా కనుసన్నల్లోనే ఉంటారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం. అందులో వారు మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. నైపుణ్యాభివృద్ధితో పాటు వారి పునరావాసానికి పథకాలు సిద్ధం చేశాం. ఏదేమైనా మార్చి 31 తర్వాత ఈ దేశంలో మావోయిస్టులు ఉండరు’ అని షా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

Two IAS Coaching Institutes: మరో రెండు ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లపై సీసీపీఏ కొరడా.. రూ.8లక్షల చొప్పున ఫైన్‌

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Updated Date - Nov 03 , 2025 | 07:08 AM