Online Lady Trap Scam: లేడీ ట్రాప్‌లో మోసపోయిన యువకుడు.. ఏకంగా 20 లక్షలు స్వాహా
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:02 AM
ఓ యువకుడు సైబర్ నేరానికి గురయ్యాడు. ఏకంగా 20 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఓ యువతి అతడ్ని ట్రాప్ చేసి మరీ దోచేసింది. బంగారం, వెండి పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడింది.
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. చదువురాని వాళ్లు, చదువుకున్న వాళ్లు అన్న తేడా లేకుండా ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో మోసాలు చేసే వారి సంఖ్య పెరిగింది. తాజాగా, పల్నాడుకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరానికి గురయ్యాడు. ఏకంగా 20 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఓ యువతి అతడ్ని ట్రాప్ చేసి మరీ దోచేసింది. బంగారం, వెండి పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడింది. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనుకున్న ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సత్తెనపల్లికి చెందిన వెంకట్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. ఓ రోజు ‘రుచి’ అనే అమ్మాయినుంచి అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతడు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. ఆ అమ్మాయి వెంకట్‌తో తరచుగా చాటింగ్ చేస్తూ ఉండేది. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ బిజినెస్ ఐడియా గురించి అతడికి చెప్పింది. తక్కువ ధరకు బంగారం, వెండి ఇప్పిస్తానని అంది. ఆమె మాటలు నిజమేనని అతడు నమ్మాడు. బంగారం, వెండి కొనడం కోసం ఆమెకు తరచుగా డబ్బులు బదిలీ చేస్తూ వచ్చాడు. అలా ఏకంగా 20 లక్షల రూపాయలు ఆమెకు పంపాడు.
రోజులు గడుస్తున్నా బంగారం కానీ, వెండి కానీ వెంకట్‌కు రాలేదు. రుచికి మెసేజ్ పెట్టినా.. ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని వెంకట్‌కు అర్థం అయింది. ఇక, చేసేది ఏమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రుచి మోసంపై ఫిర్యాదు చేశాడు. 20 లక్షల రూపాయలు మోసపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు
ఆ రాశి వారు ఈ వారం తలపెట్టిన కార్యం సఫలమవుతుంది..