Mahanadu Cycle Rally: మహానాడుకు సైకిల్ యాత్ర
ABN , Publish Date - May 26 , 2025 | 03:59 AM
కడప జిల్లా పెనుకొండ నుంచి టీడీపీ బీసీ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమానికి హాజరుకావడానికి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. సుమారు 200 కిలోమీటర్ల సైకిల్ రైడ్ ద్వారా టీడీపీ కార్యకర్తలు మహానాడు ప్రాంగణానికి చేరుకోనున్నారు.
పెనుకొండ నుంచి ప్రారంభించిన మంత్రి సవిత
పెనుకొండ టౌన్, మే 25(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో మంగళవారం నుంచి జరగనున్న ‘మహానాడు’కు హాజరయ్యేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సంజీవరెడ్డిగారి సవిత ఆధ్వర్యంలో ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం జెండా ఊపి మంత్రి సవిత.. యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కృష్ణదేవరాయల వైజంక్షన్ వరకు మంత్రి సవిత దాదాపు 4 కిలో మిటర్లు సైకిల్‌తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మంత్రి మాట్లాడుతూ.. కడపలో మూడు రోజులు మహానాడు పండుగలా జరగబోతోందన్నారు. 44 మందితో కూడిన ‘యువగళం నారా లోకేశ్’ బృందం మహానాడుకు సైకిల్ యాత్రగా బయలు దేరిందని మంత్రి తెలిపారు. కాగా.. వీరు 200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహించి మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు.