Madanapalle: మంత్రాల నెపంతో పట్టపగలే మృతదేహాన్ని వెలికితీసేందుకు యత్నం.. చివరికి..
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:38 AM
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువకుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి మంత్ర, తంత్రాల కోసం పట్టపగలే వెలికి తీసిన దొంగిలించేందుకు యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో జరిగింది.
అమరావతి, నవంబర్ 3: రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువకుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి మంత్ర, తంత్రాల కోసం పట్టపగలే వెలికి తీసిన దొంగిలించేందుకు యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో జరిగింది. మదనపల్లి పట్టణానికి చెందిన దిలీప్ రావ్ (23) అనారోగ్యంతో ఈ నెల 1న బెంగళూరులో మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె మార్గంలోని శ్మశాన వాటికలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఆ స్మశాన వాటికకు వచ్చి, పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే పశువుల కాపర్లు గుర్తించి మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఒక గంటసేపటి తర్వాత అతను మళ్లీ శ్మశానానికి వచ్చి మృతదే హాన్ని పూడ్చిన ప్రాంతంలో మట్టిని తవ్వుతుండగా.. ఈ సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మృతదేహం ఎందుకు బయటకు తీస్తున్నావని ప్రశ్నించినా.. అతను సమాధానం చెప్పకపోవడంతో గట్టిగా నిలదీశారు. దీంతో తన పేరు గోవింద్ అని తాను జైపూర్ నుంచి వచ్చి మదనపల్లెలో ఉంటున్నట్లు హిందీలో తెలిపాడు. తన చిన్నాన్న మహేష్ చనిపోయాడని అతనితో మాట్లాడేందుకు యువకుడి మృతదేహంతో మంత్ర, తంత్రాలు చేసేందుకు వెలికి తీసినట్లు ఒప్పుకున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ కళా వెంకటరమణ తమ సిబ్బందిని పంపి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Chevella Accident: ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 12 మంది మృతి
Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదుకు రంగం సిద్ధం..