Andhra Pradesh Prisons: జైళ్లలో తీర్పులేని జీవితాలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:07 AM
కోర్టుల్లో నేరం రుజువై శిక్ష పడ్డ వ్యక్తులు.. శిక్ష పూర్తయ్యేదాకా జైళ్లలో ఖైదీలుగా ఉండి తీరాల్సిందే. నేరారోపణపై పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులు కూడా ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గితే?
ప్రతి ముగ్గురిలో ఇద్దరు విచారణ ఖైదీలే
రాష్ట్రంలోని కారాగారాల్లో 7,693 మంది.. శిక్ష పడింది 2,511 మందికే
మగ్గిపోతున్న రిమాండ్ ఖైదీలు 5,065 మంది
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కోర్టుల్లో నేరం రుజువై శిక్ష పడ్డ వ్యక్తులు.. శిక్ష పూర్తయ్యేదాకా జైళ్లలో ఖైదీలుగా ఉండి తీరాల్సిందే. నేరారోపణపై పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులు కూడా ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గితే? విచారణలో జాప్యం కారణంగా ఎదురు చూపుల్లోనే ఏళ్లు గడిచిపోతే? మానసికంగా ఆ వ్యక్తితో పాటు కుటుంబం కూడా కుంగిపోతుంది. రాష్ట్రంలోని జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీల్లో ఇలాంటివారే ఎక్కువగా ఉన్నారు. కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం కేంద్ర కారాగాలతో పాటు జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మొత్తం 7,693 మంది ఉన్నారు. వారిలో శిక్ష పడిన వారు 2,511 మంది మాత్రమే ఉండగా, రిమాండ్ ఖైదీల సంఖ్య అంతకు రెండు రెట్లు(5,065) ఉంది. పోలీసుల దర్యాప్తులో జాప్యం, కోర్టుల్లో వాయిదాలతో తమ జీవితాలు ఎదురు చూపులతో జైలు గోడల మధ్యే గడిచిపోతున్నాయని రిమాండ్ ఖైదీలు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో ఏటా లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చార్జిషీట్ల వరకూ వెళ్లేవి సగం కూడా లేవు. అందులో శిక్షలు పడేవి 40శాతం కూడా ఉండవు. దీంతో నిర్ధోషులుగా విడుదలయ్యే వారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో రిమాండ్‌లోనే సుదీర్ఘకాలం జైలులో బంధించడం తమ కుటుంబాలకు అన్యాయం చేసినట్లేనని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీల్లో ఎక్కువగా హత్య కేసులు, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణల్లో అరెస్టైన వారే ఉన్నారు. తీవ్ర నేరాల కిందికి వచ్చే హత్య కేసుల్లో 1,910(25శాతం) మంది ఉన్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారిని ఎన్‌డీపీఎ్‌స(మాదక ద్రవ్యాల నిరోధక చట్టం) కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
ఈ రెండు సెక్షన్ల కింద అరెస్టయిన వారిలో శిక్ష పడిన వారి కన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే అధికం. ఎన్‌డీపీఎస్ చట్టం కింద జైళ్లలో 1,739 మంది ఉండగా వారిలో 1600 మంది రిమాండ్ ఖైదీలే కావడం గమనార్హం. ఎక్కువగా ఉత్తరాంధ్రకు చెందిన గిరిజన యువత ఈ కేసుల్లో చిక్కుకుని బెయిల్ తెచ్చుకునే స్థోమత లేక మగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. తప్పు చెయ్యనివారు జైలు నుంచి బయట పడాలంటే విచారణ తొందరగా పూర్తి చేయడమే ఏకైక మార్గం. ఖైదీల్లో మూడో స్థానంలో దొంగలు, ఆస్తితగాదాలకు సంబంధించి 1,150 మంది, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడి 658 మంది, హత్యాయత్నం కేసుల్లో 450మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ.. గృహహింస వంటి కేసుల్లోని ఖైదీల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. రాష్ట్రంలోని జైళ్లలో సిబ్బంది తక్కువ.. ఖైదీల రద్దీ పెరగడంతో పారిపోతున్న ఘటనలు కూడా తరచూ సంభవిస్తున్నాయి. నేర నిరోధం ఎంత అవసరమో వేగవంతమైన విచారణ, సత్వర తీర్పులు కూడా అవసరమని ఖైదీల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.