KTR: సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టిన దొంగ
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:22 AM
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు
పంచాయతీలు క్వార్టర్ ఫైనల్స్
ప్రాదేశిక, పురపాలక ఎన్నికలు సెమీ ఫైనల్స్: కేటీఆర్
మహబూబాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని, ఇక ముందు ఏ ఎన్నికొచ్చినా కేసీఆర్.. కారు గుర్తులను గుర్తుంచుకుని ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లోని పీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శనివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన జిల్లాలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని, దానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అన్నారు. సర్పంచ్‌లుగా కాంగ్రెస్ పార్టీ వారే ఎక్కువగా గెలిచినా.. అత్యధిక ఓట్లు మాత్రం బీఆర్‌ఎస్‌కే పడ్డాయన్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులే పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తారని, తెలంగాణలో అందుకు భిన్నంగా 45శాతం సీట్లలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు క్వార్టర్‌ఫైనల్ మాత్రమేనని, పురపాలక, ప్రాదేశిక ఎన్నికలు సెమీ ఫైనల్స్ అయితే.. 2028 అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్స్ అని వ్యాఖ్యానించారు. ‘ధనిక రాష్ట్రం తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే నడప చేతకాక గుడ్లు పీకి గోలీలాడతా అంటడు. రైతులు నిలదీస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటడు. తెల్లారితే కేసీఆర్‌ను మమ్ముల్ని తిట్టడం తప్ప సీఎంగా రేవంత్ సాధించిందేమిటి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు తులం బంగారం అంటే ఇచ్చే బాపతు కాదు. మెడలో పుస్తెలు ఎత్తుకెళ్తడని ప్రజలను అప్రమత్తం చేసినా.. రేవంత్ మాయ మాటలకు మోసపోయి పాలిచ్చే గేదెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్లయింది’ అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సబ్ బర్‌బాద్ అయిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారన్నారు. కనుక ఏ ఎన్నికల్లోనైనా కేసీఆర్ బీ-ఫామ్ ఇచ్చిన వారిని గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.