Share News

Jagtial: కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి.. యువకుడి హత్య

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:28 AM

తనతో చనువుగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఓ యువతిని బెదిరించిన యువకుడు హత్యకు గురయ్యాడు.

Jagtial: కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి.. యువకుడి హత్య

  • ప్రైవేటు వీడియోలు బయటపెడతానని యువతికి బెదిరింపులు

  • పథకం ప్రకారం యువకుడిని హతమార్చిన ఆమె బంధువులు

జగిత్యాల రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తనతో చనువుగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఓ యువతిని బెదిరించిన యువకుడు హత్యకు గురయ్యాడు. యువతి బంధవులు ఓ పథకం ప్రకారం ఆ యువకుడిని హతమార్చారు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంటకు చెందిన బుర్ర మహేందర్‌(33) వివాహితుడు. భార్యను స్వగ్రామంలో ఉంచి హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో మహేందర్‌తో పరిచయమైంది. ఈక్రమంలో వీరి మధ్య చనువు ఏర్పడింది. సదరు యువతికి వివాహం నిశ్చయమవ్వగా మహేందర్‌ ఆ పెళ్లిని అడ్డుకోవాలని చూశాడు. తనతో చనువుగా ఉండగా తీసిన వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని ఆ యువతిని బెదిరించాడు. ఆ యువతి ఈ విషయాన్ని తన బంధువుల దృష్టికి తీసుకెళ్లగా వారు పథకం ప్రకారం మహేందర్‌ను లక్ష్మీపూర్‌కు రప్పించారు. శుక్రవారం రాత్రి జగిత్యాల చేరుకున్న మహేందర్‌ను అక్కడి నుంచి లక్ష్మీపూర్‌లోని యువతి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సదరు వీడియోల విషయంలో యువతి, ఆమె బంధువులతో మహేందర్‌కు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో యువతి బంధువులు మహేందర్‌ కళ్లలో కారం చల్లి రాడ్డుతో కొట్టారు. దీంతో మహేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Dec 28 , 2025 | 07:30 AM