Share News

Liquor Case: లిక్కర్‌ నిందితులకు నార్కో టెస్ట్‌

ABN , Publish Date - Jun 27 , 2025 | 02:31 AM

నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తయితే, ఆ నేరాన్ని రుజువుచేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే! ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు.. రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతుంటారు.

Liquor Case: లిక్కర్‌ నిందితులకు నార్కో టెస్ట్‌

అన్నీ తెలిసీ నోరు విప్పని బాసులు

  • వారితో నిజాలు చెప్పించేందుకే నార్కో పరీక్షలు చేసే ఆలోచన

  • కోర్టులో పిటిషన్‌ వేయనున్న సిట్‌

  • కోర్టు అనుమతిస్తే ఐదుగురికి నిర్వహణ రాజ్‌ కసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లై డిటెక్టర్‌ పరీక్ష చేసే అవకాశం

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తయితే, ఆ నేరాన్ని రుజువుచేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే! ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు.. రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే తెలివైన నిందితుల నుంచి అంతే తెలివిగా నిజాలు రప్పించేందుకు నార్కో పరీక్షలు, పాలిగ్రాఫ్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటి పద్ధతులు ఉన్నాయి. లిక్కర్‌ కేసు వెలికి తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇప్పుడు ఈ పద్ధతులు అనుసరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. మద్యం దోపిడీకి జగన్‌ హయాంలో రచించిన ప్రణాళిక నుంచి దాని అమలు, ముడుపుల వసూళ్లు.. వాటాల పంపిణీ.. వాహనాల్లో తరలింపు.. ప్రతిదీ ఆధారాలతో సహా సేకరించింది. నిందితులు, లబ్ధిదారులు, సాక్షులను విచారించి కేసును దాదాపు కొలిక్కి తెచ్చారు. అంతిమ లబ్ధిదారు ఎవరో రాష్ట్రమంతటికీ తెలిసినా ఈ దందాలో ప్రతి అంశమూ న్యాయస్థానంలో నిలిచేలా ఉండాలి. సిట్‌ అధికారులు ఏ-1 రాజ్‌ కసిరెడ్డిని ఎంత ప్రశ్నించినా అడ్డగోలు సమాధానాలు తప్ప నిజాలు చెప్పలేదు. వారం రోజులకు పైగా కస్టడీకి తీసుకుని వందల ప్రశ్నలు సంధించినా అసలు గుట్టు వెల్లడించలేదు. ‘ఇవిగో నీ పాత్రపై ఆధారాలు...’ అంటూ దర్యాప్తు అధికారులు ముందు పెట్టి ప్రశ్నిస్తే మౌనం వహించారు.


పదే పదే ప్రశ్నించడంతో.. ‘మీరు నన్ను జైలుకు మాత్రమే పంపగలరు. అసలు వ్యక్తి పేరు వెల్లడిస్తే నన్ను పైకి పంపుతారు’ అంటూ భయాన్ని వ్యక్తం చేశారు. రాజ్‌ కసిరెడ్డితో పాటు ఇప్పటి వరకూ తొమ్మిది మంది అరెస్టైన ఈ కేసులో నిందితుల జాబితా 39కి చేరింది. ఈ కేసులో కీలక వ్యక్తులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దనుంజయ్‌ రెడ్డి(ఏ-31), మాజీ సీఎం జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణ మోహన్‌ రెడ్డి(ఏ-32), భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప(ఏ-33) తమకు ఏమీ తెలియదని విచారణలో చెప్పారు. అయితే ఆ ముగ్గురి పాత్రపై టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించిన సిట్‌ వాటిని ముందుంచి ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా మరో కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని(ఏ-38) సిట్‌ అరెస్టు చేసింది. మద్యం ముడుపుల డబ్బులు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు వాహనాల నంబర్లు, టోల్‌ గేట్లలో ఫుటేజీ, హైదరాబాద్‌లో డబ్బు తీసుకుని ఏపీకి తీసుకొచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలు, వారి టవర్‌ లొకేషన్లన్నీ చూపించి చెవిరెడ్డిని ప్రశ్నించినా ఆయన నిజాలు వెల్లడించలేదు. పైగా తనను మానసికంగా ఇబ్బంది పెట్టి తాను చెప్పని విషయాలు రిమాండ్‌ రిపోర్టులో రాశారంటూ సిట్‌ అధికారులపై కోర్టులో నిందలేశారు. ఇవన్నీ సమీక్షించుకున్న సిట్‌ అధికారులు, న్యాయస్థానం అనుమతి తీసుకుని నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు కోర్టులో అనుమతి పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ అంటే..

సెన్సార్లతో కూడిన ఎలకా్ట్రనిక్‌ పరికరాలను శరీరానికి అమర్చి, నిందితుడి బీపీ, పల్స్‌, శ్వాసక్రియ, ఇతర భావోద్వేగాలను జాగ్రత్తగా నిపుణుడు పర్యవేక్షిస్తాడు. సదరు వ్యక్తిని దర్యాప్తు అధికారి ప్రశ్నించినప్పుడు... వాటిలో కనిపించే మార్పు ఆధారంగా అతడు చెప్పేది నిజమా.?లేక అబద్ధ్దమా.? అనేది నిర్ధారణకు వస్తారు. ఈ పద్ధతినే ‘లై డిటెక్టర్‌ టెస్ట్‌’ అని కూడా పిలుస్తారు.

నార్కో-విశ్లేషణ..: గ్రీకు భాషలో నార్క్‌ అంటే తిమ్మిరి. ఈ పరీక్షలో వ్యక్తి శరీరంలోకి ట్రూత్‌ సీరమ్‌ (సోడియం పెంటోథాల్‌, స్కోపోలమైన్‌, సోడియం అమిటల్‌) అనే మిశ్రమంతో కూడిన మందును నిందితుడికి ఇంజెక్షన్‌ ద్వారా ఇచ్చి మెదడు నిగ్రహం కోల్పోయే స్థితికి తీసుకొస్తారు. సగం నిద్రలోకి వెళ్లిన నిందితుడు ఆ ఇంజెక్షన్‌ ప్రభావంతో ఎలాంటి అదుపు లేకుండా తనకు తెలిసిన విషయాలను దర్యాప్తు అధికారికి వెల్లడిస్తాడు.


బ్రెయిన్‌ మ్యాపింగ్‌..: ముఖం, మెడ ప్రాంతాల్లో ఎలక్ర్టికల్‌ వైర్లతో కూడిన కప్స్‌ అమర్చి మెదడు కార్యకలాపాలను అంచనా వేస్తారు. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా లేదా అబద్ధమా అనేది ఈ విధానంలో తెలుసుకోవచ్చు.

Updated Date - Jun 27 , 2025 | 02:31 AM