Kautalam Mandal: పిడుగుపాటుకు ముగ్గురు బలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:46 AM
కర్నూలు జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. కౌతాళం మండలంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
కర్నూలు జిల్లాలో విషాదం
కౌతాళం, అనంతపురం అర్బన్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఒక రైతు ఉన్నారు. మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో ఆదివారం తెలుగు అశోక్(21), తలారి బాలయ్య(22)తో పాటు మరో 8 మంది యువకులు, చిన్నారులు సమీప పొలాల్లో క్రికెట్ ఆడడానికి వెళ్లారు. ఈదురుగాలులతో వర్షం ప్రారంభమవడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో అశోక్, బాలయ్య అక్కడే స్పృహ కోల్పోగా.. ఇద్దరు బాలురు నిరుపాది, గంగాధర్ గాయపడ్డారు. గంగాధర్‌ను చికిత్స కోసం హాల్వి గ్రామానికి తీసుకెళ్లారు. మిగతా ముగ్గురిని కౌతాళం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఆదోని వైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువకులు అశోక్, బాలయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలయ్యకు గతేడాది వివాహం కాగా భార్య మీనాక్షి ప్రస్తుతం గర్భిణి. అలాగే, క్రిష్ణగిరి మండలంలోని కటారుకొండ గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు(52) పొలంలో పనులు చేసుకుంటుండగా వర్షం కురవడంతో చెట్టు కిందకు వెళ్లారు.
పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు ఎగసిపడ్డాయి. గుమ్మఘట్ట మండలం రంగచేడు గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన ఆనందరెడ్డి తోటలోని చీనీ చెట్టుపై పిడుగు పడడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.