Telugu Culture: భాషా సంఘానికి మండలి పేరు
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:43 AM
ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పాటు కావడానికి మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ముఖ్యకారకుడని సీఎం చంద్రబాబు తెలిపారు.
వెంకట కృష్ణారావు సేవాభావం ఉన్న నేత
చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు: సీఎం
విజయవాడ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పాటు కావడానికి మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ముఖ్యకారకుడని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన చట్టసభల్లో బిజీగా ఉన్నా, ప్రజాసేవలో ఉన్నా భాషాభిమానాన్ని ఎక్కడా తగ్గించుకోలేదని.. అందుకే రాష్ట్రంలో అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఇక నుంచి అది ‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం’గా ఉంటుందన్నారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మండలి శతజయంతి వేడుకలు జరిగాయి. సీఎం తొలుత కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ఒకప్పుడు సేవాభావం కలిగిన నాయకత్వం, విలువతో కూడిన రాజకీయాలు ఉండేవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా విలువలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వ్యక్తిగత రాజకీయం చేయను. సమాజహితం కోసమే రాజకీయాలు చేస్తా. ఎవరు రెచ్చగొట్టినా లైన్ దాటలేదు. విలువలు, సంపాదన కలిసి ముందుకు సాగాలి. మండలి వెంకట కృష్ణారావు పవిత్రత, సేవాభావం కలిగిన నేత. 1978లో ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేశాను. దివిసీమకు ఉప్పెన వచ్చినప్పుడు ఆయన అందించిన సేవలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. గాంధీజీ ఆశయాలను, ఆదర్శాలను పాటించి మండలి ప్రజలకు సేవ చేశారు. చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా జిల్లా ప్రజల గుండెల్లో ఆయన నిలిచి ఉంటారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో తనకిచ్చిన ఐదెకరాలను పేదలకు పంపిణీ చేశారు’ అని వివరించారు. భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఏ దేశంలోనూ లేదన్నారు. ‘కుటుంబ వ్యవస్థ ఒక భద్రత. దాని వల్ల ఎన్ని సమస్యలున్నా అధిగమించగలం’ అని చెప్పారు.
తెలుగుజాతి సమైక్యత కోసం పాటుబడ్డారు
మండలి కుమారుడు, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. తన తండ్రి తెలుగుజాతి, మానవజాతి సమైక్యత కోసం పాటుపడ్డారని తెలిపారు. ‘ఏ లైట్ హౌస్ ఇన్ ది స్ట్రార్మ్’ పేరుతో రూపొందించిన ఆంగ్ల వ్యాసాల సంపుటిని, భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు చిత్రీకరించిన మండలి వెంకట కృష్ణారావు చిత్రపటాన్ని, ఆయన రాసిన ‘ఆదర్శ నేత, అజాత శత్రువు మండలి వెంకట కృష్ణారావు’ అనే పుస్తకాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News