Share News

Temple Administration: శిక్షణపై సీతకన్ను

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:33 AM

దేవదాయశాఖ ఉద్యోగుల్లో చాలామందికి ఆ శాఖ చట్టాలపైనా, ప్రభుత్వ నిబంధనలపైనా కనీసం అవగాహన కూడా లేదన్న విమర్శలొస్తున్నాయి. అధికారులకు తోచింది అమలు చేస్తున్నారని.. చట్ట నిబంధనలు పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

 Temple Administration: శిక్షణపై సీతకన్ను

  • దేవదాయ ఉద్యోగులకు నిలిచిన శిక్షణ

  • ఐదేళ్ల క్రితం వేల మంది ఉద్యోగులకు ‘సీత’లో శిక్షణ

  • వైసీపీ అధికారంలోకి వచ్చాక శిక్షణ కేంద్రానికి తాళం

  • దేవుడి ఆస్తుల రక్షణలో విఫలమవుతున్నారని ఉద్యోగులపై విమర్శలు

  • కొత్త ఏసీలు, గ్రేడ్‌-3 ఈవోలకు చట్టాలపై అవగాహన శూన్యం

  • శిక్షణా కార్యక్రమాల కోసం ఉద్యోగుల డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయశాఖ ఉద్యోగుల్లో చాలామందికి ఆ శాఖ చట్టాలపైనా, ప్రభుత్వ నిబంధనలపైనా కనీసం అవగాహన కూడా లేదన్న విమర్శలొస్తున్నాయి. అధికారులకు తోచింది అమలు చేస్తున్నారని.. చట్ట నిబంధనలు పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీనివల్ల దేవుడి ఆస్తులకు తీవ్ర నష్టం జరగడంతో పాటు ఆలయాల్లో పరిపాలన సక్రమంగా నడవడం లేదు. దీనికి కారణం దేవదాయ శాఖ చట్టం, ప్రభుత్వ నిబంధనలపై ఉన్నతాధికారులు, ఉద్యోగులకు శిక్షణ లేకపోవడమే.


ఉమ్మడి ఏపీలో ఇలా..

ఉమ్మడి ఏపీలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీఐ)లో ఉద్యోగులకు శాఖాపరమైన శిక్షణలు ఇచ్చేవారు. కలెక్టర్ల దగ్గర నుంచి జూనియర్‌ అసిస్టెంట్ల వరకూ ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు, జీవోలపైన శిక్షణ ఇవ్వడంతో పాటు ఆలయాల ఆచార సంప్రదాయాలు, సాంస్కృత్రిక వారసత్వంతో పాటు ప్రభుత్వంలో ఫైల్స్‌ ఎలా పెట్టాలన్న దానిపై పూర్తిగా అవగాహన కల్పించేవారు. ఈ శిక్షణల వల్ల ఉద్యోగులకు అవగాహన పెరగడంతో పాటు ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి శిక్షణలు చాలా వరకూ తగ్గాయి. 2016-19 మధ్య ఎక్కువగా చట్టాలపై ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల శిక్షణ ప్రస్తావనే లేదు. ముఖ్యంగా దేవదాయ శాఖ విభజన తర్వాత ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరంలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెంపుల ఆడ్మినిస్ట్రేషన్‌(సీత)ను ఏర్పాటు చేసుకుంది. ‘సీత’ ద్వారా 2016 నుంచి 2019 వరకూ వేల మందికి శిక్షణ ఇచ్చింది. జాయింట్‌ కమిషనర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగుల వరకూ ఇక్కడ శిక్షణ తీసుకునేవారు. గతంలో సీతకు ఒక డైరెక్టర్‌, కో- ఆర్డినేటర్‌ ఉండేవారు.


వారి పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు జరిగేవి. కొంత కాలంగా ఈ పోస్టుల్లో ఎవరినీ ప్రభుత్వం నియమించ లేదు. గతంలో వేర్వేరు సంస్థల నుంచి ఫ్యాకల్టీని తీసుకువచ్చి శిక్షణలు ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యాలయానికి తాళం వేశారు. శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల శాఖలో కొత్తగా వచ్చిన అసిస్టెంట్‌ కమిషనర్లు, గ్రేడ్‌-3 ఈవోలకు చట్టంపై కనీస అవగాహన లేదు. ప్రధానంగా జిల్లాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చే ఫైల్స్‌లో సృష్టత లేకపోవడంతో ప్రధాన కార్యాలయం అధికారులు, ఉద్యోగులు వాటిని మళ్లీ మార్పులు, చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిదంటున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో గ్రేడ్‌-3 ఈవోలు, పదోన్నతుల ద్వారా జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు అయ్యే ఉద్యోగుల దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కొందరు దేవదాయ శాఖ చట్టాన్ని వారికి అనుకూలంగా, నచ్చిన విధంగా మార్పుకుని అమలు చేస్తున్నారన విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సంప్రదాయాలు, ఆలయాల ప్రతిష్ఠతలు, సంప్రదాయాల గురించి కూడా ఉద్యోగులు, అర్చకులకు అవగాహన కల్పించే శిక్షణలు కూడా నిలిచిపోయాయి.

దుర్గగుడికి ఆదాయానికీ గండి!

కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన భవంనంలోనే ఈ ‘సీత’ కార్యాలయం ఏర్పాటు చేశారు. గతంలో ఈ భవనంలో ఉన్న గదలు భక్తులకు అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం వచ్చేది. ఇప్పుడు సీత కార్యాలయం ఉందనే ఉద్దేశంతో భక్తులకు ఇవ్వడం లేదు. అలా అని శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో కనకదుర్గమ్మ ఆలయ ఆదాయానికి కూడా గండిపడుతోంది. ఇప్పటికైనా ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించాలని ఉద్యోగుల నుంచే డిమాండ్లు వస్తున్నాయి.

Updated Date - Jul 02 , 2025 | 05:37 AM