Share News

ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:03 AM

పేదలకు ఇళ్ల స్థలాల భూ సేకరణ పేరిట వైసీపీ హయాంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. వైసీపీ నాయకులు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. భూసేకరణకు ముందే రైతులతో తక్కువ ధరలకు అగ్రిమెంట్‌ చేసుకుని.. తర్వాత అమాంతంగా ధరలు పెంచేసి ప్రభుత్వం కొనుగోలు చేసేలా కుట్రలు చేశారు...’ అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలంటూ గురువారం కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాను కలసి ఫిర్యాదు చేశారు.

ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం
విలేకరులతో మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘పేదలకు ఇళ్ల స్థలాల భూ సేకరణ పేరిట వైసీపీ హయాంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. వైసీపీ నాయకులు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. భూసేకరణకు ముందే రైతులతో తక్కువ ధరలకు అగ్రిమెంట్‌ చేసుకుని.. తర్వాత అమాంతంగా ధరలు పెంచేసి ప్రభుత్వం కొనుగోలు చేసేలా కుట్రలు చేశారు...’ అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలంటూ గురువారం కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయంలో జగనన్న కాలనీలు, పేదలకు ఇళ్ల స్థలాలు పేరిట సాగించిన భూ సేకరణలో రాష్ట్రంలో రూ.వందల కోట్లు ప్రజాధనం దోపిడీ చేశారని ఆరోపించారు. ఆదోని పట్టణ శివారులో డాణాపురం వద్ద జగనన్న కాలనీ నిర్మాణం కోసం 65 మంది రైతుల నుంచి 178 ఎకరాలు సేకరించారని తెలిపారు. 2020 మార్చి 6న జారీ చేసిన 29/2020, 30/2020 భూ సేకరణ నోటీసుల ద్వారా రూ.24.03 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఆయన తనయుడు వై.మనోజ్‌రెడ్డి, అనుచరులు ఎర్రిస్వామి, చంద్రకాంత్‌రెడ్డి, కామాక్షి తిమప్ప, బి.నరసింహులు, జి.సందీ్‌పరెడ్డి, కామవరం మహేందర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులతో పాటు అప్పటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) టి.జయరామిరెడ్డిల ద్వారా రైతులతో బలవంతంగా ముందస్తు ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు.

ఎకరాకు రూ.5 లక్షలు మాత్రమే నష్ట పరిహారం ఇవ్వబోతున్నట్లు రైతులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎకరానికి రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు ప్రభుత్వం ధర నిర్ణయించిన రైతులకు తెలియకుండా చేశారని, ఆ తరువాత అదే భూమిని ఎక్కువ ధరకు సేకరించడం ద్వారా రైతులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు.

బెదిరించి వసూలు..

ప్రభుత్వం రైతులకు భూ నష్టపరిహారం చెల్లించిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆయన అనుచరులు రైతులను బెదిరించి ఎకరాకు రూ.7-8 లక్షలు అక్రమంగా వసులు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దాడులకు కూడా పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం రైతులకు చెల్లించిన రూ.24.03 కోట్లలో రూ.8.90 కోట్లు మాత్రమే రైతులకు చేరిందని, మిగిలిన రూ.15.13 కోట్లు అక్రమ మార్గాల్లో మళ్లించారని, భూసేకరణలో జరిగిన భారీ కుంభకోణం అన్నారు. సమగ్ర విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 12:03 AM