నందీశ్వరుడికి పూజలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:22 AM
శ్రీశైల క్షేత్రంలోని ఆలయ ప్రాంగణంలో లోని నందీశ్వరస్వామికి బుధవారం త్రయోదశి సందర్భంగా విశేష అర్చనలు చేశారు.
నంద్యాల కల్చరల్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలోని ఆలయ ప్రాంగణంలో లోని నందీశ్వరస్వామికి బుధవారం త్రయోదశి సందర్భంగా విశేష అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకస్వాములతో నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, శుద్ధజలంతో అభిషేకాలు నిర్వహించారు. సాక్షిగణపతికి బుధవారం విశేషపూజలు నిర్వహించారు. శ్రీశైలం ప్రాంగణంలోని మల్లికార్జునస్వామి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. నిత్య కళారాధనలో భాగంగా కర్నూలు సూర్య కల్చరల్ అకాడమీ బృందంతో సంప్రదాయ నృత్యప్రదర్శన నిర్వహించారు.
మహానంది: మహానంది క్షేత్రంలోని నందీశ్వరునికి శ్రావణ బహుళ త్రయోదశి, మహాప్రదోషం పురస్కరించుకొని బుధవారం సాయంత్రం వేదపండితులు ఘనంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలతో పంచామృతాలు, విశేష చూర్ణికలు, వట్టి వేరు, కురువేరు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.