Share News

పైసలిస్తేనే పని..

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:22 AM

పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ఇవ్వకపోతో ఏదో ఓ సాకుతో అధికారులు పెండింగ్‌ పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. డబ్బులు ఇస్తే గుట్టుచప్పుడు కాకుండా చక్కపెట్టేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పైసలిస్తేనే పని..
ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇంతే..

విసిగిపోతున్న జనం

ఆలూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ఇవ్వకపోతో ఏదో ఓ సాకుతో అధికారులు పెండింగ్‌ పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. డబ్బులు ఇస్తే గుట్టుచప్పుడు కాకుండా చక్కపెట్టేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ లేక..

మూడు నెలల క్రితం సబ్‌ రిజిస్ట్రార్‌ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెగ్యులర్‌ రిజిస్ట్రార్‌ లేకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చారు. ఇంకేముంది సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. బ్యాంకు రుణాలు పొందేందుకు స్పెషల్‌ అడిషనల్‌ స్టాంప్స్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పత్తికొండ, ఆదోనికి వెళ్లి తెచ్చుకోవాల్సివస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మకాం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మకాం వేసినట్లు తెలుస్తోంది. వీరి పనులు మాత్రం చకచకా అయిపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో ఎసీబీ దాడులు

గతంలో ఎసీబీ అధికారులు దాడులు చేశారు. ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. అయినా ఇక్కడ అవినీతి ఆగడం లేదు. జిల్లా అధికారులు స్పందిచి, రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నియమించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సమర్పించుకుంటేనే పని..

మీసేవ కేంద్రాల్లో ఈసీలు రావడం లేదు. దీంతో ప్రజలు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి వస్తున్నారు. ముడుపులు సమర్పించుకుంటేనే పని అవుతోందని ఆరోపణలు వినిస్తున్నాయి. కోయనగర్‌కు చెందిన ఓ యువకుడు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. రూ.500లు ఇచ్చేవరకు మంజూరు చేయలేదు.

డబ్బులు తీసుకోవడం లేదు

రిజిస్ట్రేషన్‌, ఈసీ తదితర పనుల కోసం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. ఎవరైౖనా డబ్బులు అడిగితేనా దృష్టికి తీసుకురావాలి. ఈసీలు పెండింగ్‌ పెట్టకుండా చూస్తున్నాం. స్పెషల్‌ అడిషనల్‌ స్టాంప్స్‌ కోసం ఇండెంట్‌ పెట్టాం.

- వేణుగోపాల్‌, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌, ఆలూరు

Updated Date - Feb 15 , 2025 | 12:22 AM