Share News

రబీకి సాగునీరు అందేనా..?

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:35 PM

నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని కేసీ కాలువ పరిధిలో రబీ సాగుకు నీరు విడుదలపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి..!

రబీకి సాగునీరు అందేనా..?
కేసీ కాలువ కింద వరి నాట్లు

0.55 టీఎంసీలకు పడిపోయిన సుంకేసుల జలాశయం

తుంగభద్ర డ్యాంలో కేసీ వాటా 7.05 టీఎంసీలు మిగులు

టీబీ డ్యాం నుంచి 2 వేల క్యూసెక్కులు విడుదల

నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని కేసీ కాలువ పరిధిలో రబీ సాగుకు నీరు విడుదలపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి..! డిసెంబరు 10న జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో చేసిన తీర్మానం ఇది. రబీ సాగులో భాగంగా ఇప్పటికే రైతులు వరినాట్లు ప్రారంభించారు. సాగునీరు ఇస్తున్నారా..? ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు..? ఇందులో స్పష్టత లేదు. తుంగభద్ర డ్యాంలో 7.05 టీఎంసీలు కేసీ వాటా మిగులు ఉంది. ప్రభుత్వ అనుమతితో టీబీ డ్యాం నుంచి 2 వేల క్యూసెక్కులు విడుదల చేసినా సుంకేసులకు చేరలేదు. దీంతో సుంకేసుల జలాశయం 0.55 టీఎంసీలకు పడిపోయింది. రబీ సాగుపై స్పష్టత ఇవ్వాలని కేసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

కర్నూలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ పరిధిలో 90 వేల ఎకరాలు రబీ ఆయకట్టు ఉంది. కేడబ్ల్యూడీటీ అవార్డు (జస్టిస్‌ బచావత్‌ అవార్డు)-1 ప్రకారం 31.90 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు. అందులో 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి తీసుకోవాల్సి ఉంది. 21.90 టీఎంసీలు సుంకేసుల జలాశయం నుంచి నది ప్రవాహం ద్వారా తీసుకునేలా డిజైన్‌ చేశారు. కేసీ ఆయకట్టు రైతుల జీననాధారమైన సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలు మాత్రమే కావడంతో నదీప్రవాహ నీటిపై ఆధార పడాల్సి వస్తున్నది. అయితే.. ఏటేటా తుంగభద్రలో నీటి ప్రవాహం తగ్గిపోతుండడంతో రబీ సాగుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కేసీ ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ‘ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం’ నుంచి వెయ్యి క్యూసెక్కులు తీసుకునేలా నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. శ్రీశైలం జలాశయం నీటిపై స్పష్టమైన విధానం లేకపోవడంతో రబీకి సాగునీటి విడుదలపై ఇంజనీర్లు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. తుంగభద్ర డ్యాంలో కేసీ నీటి వాటా సకాలంలో వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఆ నీటిని అవసరమైన మేరకు వినియోగించుకుంటే రైతులు సాగునీటి ఇబ్బందులు రాకుండా నీరు ఇవ్వవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

తుంగభద్ర జలాశయమే ఆధారం

కేసీ కెనాల్‌ నీటివాటా తుంగభద్ర డ్యాంలో 7.05 టీఎంసీలు మిగులు ఉన్నాయి. డ్యాం నుంచి నీటిని తీసుకోవాలంటే 225 కిలో మీటర్లు నదిలో ప్రవహించి సుంకేసుల బ్యారేజీకి చేరాల్సి ఉంది. ఎగువన నదీతీరంలో వివిధ ఎత్తిపోతల పథకాలు, ఆయా గ్రామాల రైతులు నీటిని వినియోగించుకుంటారు. అలాగే.. ఆర్డీఎస్‌ ఆనకట్ట దాటి దిగువకు ప్రవహించాలి. అంటే.. వాటా నీటిలో 45-55 శాతం కూడా సుంకేసులకు చేరే అవకాశం లేదని ఇంజనీర్లు అంటున్నారు. అదే క్రమంలో టీబీ డ్యాం నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆర్డీఎస్‌ ఎడమ కాలువ నీటివాటాను నదీ ద్వారా తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ వాటా 2 వేల క్యూసెక్కులు. కర్ణాటక వాటా 125 క్యూసెక్కులు టీబీ డ్యాం నుంచి తీసుకుంటున్నారు. ఆ రాష్ట్రాలతో పాటే కేసీ కాలువ నీటివాటాను కూడా తీసుకుంటే నదీ ప్రవాహంలో నీటి నష్టం (వాటర్‌ లాస్‌) తక్కువగా ఉంటుందని, మనం ఇచ్చే ఇండెంట్‌లో 65-70 శాతం నీరు సుంకేసుల డ్యాంకు చేరుతుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ, కర్ణాటక వాటాతో కలసి కాకుండా ఏపీ వాటా నీటిని ఒక్కటే తీసుకుంటే ఆర్డీఎస్‌ ఆనకట్ట దాటి నీరు దిగువకు రావడమే కష్టమని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్డీఎస్‌ వాటాగా వెయ్యి క్యూసెక్కులు, కేసీ కెనాల్‌ వాటాగా ఏపీ 2 వేలు క్యూసెక్కులు ఇండెంట్‌ మేరకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేస్తున్నారు. శనివారం సుంకేసులకు దాదాపు వెయ్యి క్యూసెక్కులు చేరుతుందని, ఒకటి రెండు రోజుల్లో కేసీ కాలువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు అంటున్నారు.

అడుగంటిన సుంకేసుల బ్యారేజీ

తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కాలువకు 10 టీఎంసీల నీటివాటా ఉంది. ఆ ఏడాది టీబీ బోర్డు వాటర్‌ రివ్యూ కమిటీ 9.05 టీఎంసీలు కేటాయించింది. బోర్డు నిబంధనలు మేరకు అక్టోబరు ఆఖరిలోగా 2 టీఎంసీలు వినియోగించుకోవాలి. తుంగభద్రలో వరద ప్రవాహం ఉండడంతో ఆ నీటిని వినియోగించుకోకపోవడం వల్ల హెచ్చెల్సీ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు మళ్లించారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో కేసీ వాటాగా 7.05 టీఎంసీలు ఉన్నాయి. సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువ 0.00 నుంచి 234.64 కిలోమీటర్ల వరకు ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో, 234.64 కి.మీల నుంచి 305.65 కిలోమీటర్ల వరకు (71.01 కి.మీలు) కడప జిల్లాలో ప్రవహిస్తుంది. 0/0 నుంచి 32 కి.మీలు వరకు 3,763 ఎకరాలు ఆయకట్టు ఉంది. కేవలం సుంకేసుల డ్యాం నుంచి మాత్రమే నీరు ని తీసుకుంటే తప్ప సాగునీరు ఇవ్వలేం. ఆ తరువాత మాల్యాల లిఫ్టు, ముచ్చుమర్రి లిఫ్టు నుంచి కృష్ణా జలాలు తీసుకునే అవకాశం ఉన్నా.. కేఆర్‌ఎంబీ కేటాయింపులపై ఆధారపడి ఉంటుంది. దీంతో సుంకేసులు డ్యాం నుంచి 2,400 క్యూసెక్కులు కేసీ కాలువకు విడుదల చేస్తే కడప జిల్లాలో కూడా ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ఇవ్వవచ్చు. అయితే.. సుంకేసులు బ్యారేజీ అడుగంటుతోంది. ప్రస్తుతం కేవలం 0.55 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.

కేసీ ఆయకట్టుకు సాగునీరు ఇస్తాం

కేసీ కాలువ కింద రబీలో సాగు చేసిన పంటలకు సాగునీరు ఇస్తాం. తుంగభద్ర డ్యాంలో కేసీ వాటా 7.05 టీఎంసీలు ఉంది. ఆ నీటిని తీసుకోవడానికి వీలుగా రోజుకు 2 వేలు క్యూసెక్కులు ప్రభుత్వ ఆదేశాల మేరకు టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేసీ కాలువకు సుంకేసుల బ్యారేజీ నుంచి నీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తాం.

- ప్రతాప్‌, కేసీ కాలువ ఈఈ

Updated Date - Jan 18 , 2025 | 11:35 PM