విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:57 PM
విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి.

ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి.
కర్నూలు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురానికి చెందిన సాదిక్ వలి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు విద్యానగర్‌కు చెందిన సందీప్ చంద్రపాల్ ఫిర్యాదు చేశారు.
నా కుమారుడు సురేష్‌ను కెనడాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి పంపిస్తామని ఢిల్లీకి చెందిన ఆశా ఠాకూర్ ఫీజుల పేరుతో రూ.1.6 లక్షలు కట్టించుకుని మోసం చేశారని వెంకట రమణ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు.
కుమారుడు ఇంట్లో అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు అశోక్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు.
నా భర్త మధు ఆస్తి గొడవలు పడి నా 3 సంవత్సరాల కుమారుడుని తీసుకెళ్లిపోయాడని నా బాబును ఇప్పించాలని కర్నూలు మండలం, ఉల్చాల గ్రామానికి చెందిన ప్రమీల ఫిర్యాదు చేశారు.
మా బావగారైన వెంకటస్వామి, నడిపి వెంకటస్వామి కలిసి మా పొలాన్ని ఆక్రమించుకున్నారని వెల్దుర్తి మండలం అమకతాడు గ్రామానికి చెందిన మల్లమ్మ ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ అడ్మిన్ హుశేన్‌పీరా, సీఐ శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు.