తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి: కలెక్టర్
ABN , Publish Date - May 03 , 2025 | 11:37 PM
తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలని కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు.
నంద్యాల నూనెపల్లె, మే 3 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలని కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు. పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాయలసీమ జోన్‌లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి కృషిచేసిన విద్యార్థులను కలెక్టర్ రాజకుమారి అభినందించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తోపాటు డీఈవో జనార్దన్‌రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డీసీవో శ్రీదేవి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో 81శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉన్నారు. ఇదే పరంపరను జీవితంలో ఆఖరిమెట్టువరకు కొనసాగించాలని అన్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతో మురిసిపోకుండా భవిష్యత్‌లో రాబోయే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని అందుకు నిరంతర సాధన చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన అంశాలను తప్పనిసరిగా పాటిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. జిల్లాలో 19శాతం విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించలేకపోయారని, కారణాలు విశ్లేషించి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేవిధంగా సంసిద్ధులనను చేయాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమెంటోతో అభినందించారు. ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.