Share News

మారని తీరు

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:31 AM

ఎమ్మిగనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల తీరు ఏ మాత్రం మారలేదు.

మారని తీరు
వాగ్వాదం చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ సభ్యులు

అనవసర విషయాలపై వాగ్వాదం

బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కౌన్సిల్‌

ఎమ్మిగనూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల తీరు ఏ మాత్రం మారలేదు. కౌన్సిల్‌ సమావేశాల్లో జరుగుతున్న వాగ్వాదాలపై పట్టణ ప్రజలు ఈసడించుకుంటున్నా ప్రతి పక్ష, అధికార సభ్యుల తీరు ఏ మాత్రం మారడంలేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తూ కౌన్సిల్‌ సమావేశంలో అనవసర విషయాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాగ్వాదాలకు దిగుతుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మున్సి పల్‌ కౌన్సిల్‌ హాల్‌లో చైర్మన డాక్టర్‌ రఘు అధ్యక్షతన మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలో ప్రవేశపెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా చదువుతుండా మున్సిపల్‌ వైస్‌ చైర్మన నజీర్‌ అహ్మద్‌ లేచి బడ్జెట్‌ను ఆమోదిస్తున్నామని చెప్పడంతో సభ్యులు ఆమోదిం చారు. అనంతరం టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో 15శాతం నిధులు పెంచడం హర్షణీయమన్నారు. అలాగే ఎస్సీలకు, మహిళా సంక్షేమానికి ప్రత్యేక గ్లాంట్లు పెట్టారన్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ప్రతిసారి మిగులు బడ్జెట్‌గా ఉండడం హర్షణీయమన్నారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో మిగిలిన బడ్జెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ మున్సిపాలిటీ వినియోగించుకునేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామని చెబుతుండగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన నజీర్‌ అడ్డు తగిలారు. ఏప్రిల్‌ నుంచి మీ ప్రభు త్వం ఎక్కడ ఉందని ప్రశ్నించడంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. వైస్‌ చైర్మన దయాసాగర్‌ దీనిపై పూర్తి వివరాలను చెబుతుండగా వైస్‌ చైర్మన మరోసారి అడ్డు తగిలి మాకు క్లారిటీ చెప్పాలని, ఎప్పటి నుంచి ఆదేశాలు ఇచ్చారోనని ప్రశ్నించడంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే గాక ఒకటో వార్డు వైసీపీ కౌన్సిలర్‌ నాగేషప్ప కల్పించుకొని అనవసర విష యాలు మాట్లాకుండా వార్డులో సమస్యలు మాట్లాడాలని పేర్కొనడంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ బడ్జెట్‌పై మాట్లాడుతుంటే అనవసర విషయాలు అంటారా అంటూ నాగేషప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని చెబుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా మధ్యలో మాట్లాడడం సరైందికాదని మండిపడ్డారు. దీంతో చైర్మన రఘు వైస్‌ చైర్మన నజీర్‌ను కూర్చోమని చెప్పడంతో ఆయన కుర్చున్నట్లు కూర్చొని తిరిగి లేవడం పట్ల టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సమస్యలపై ఏకరువు పెట్టిన సభ్యులు: పట్టణంలోని 1వ వార్డులో కుక్కలు అధికంగా ఉన్నాయని కౌన్సిలర్‌ నాగేషప్ప అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వైస్‌ చైర్మన దివ్యకళ మాట్లాడుతూ ఎస్సీ కాలనీ లోని పాత మారెమ్మగుడి దగ్గర బోరు పనిచేయడం లేదని తెలిపారు. కొన్ని నెలలుగా సభ్యులకు గౌరవ వేతనం కూడా రావడంలేదని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనను వైస్‌ చైర్మన-2గా వ్యవహరిస్తున్నారని, ఏమైనా ప్రభుత్వం అలా జీవో ఇచ్చిందా.. ఇచ్చి ఉంటే నాకు ఒక కాపీ ఇవ్వాలని ఆమె కమిషనర్‌ను కోరారు. ఇంతకు ముందు 6వ వార్డు కౌన్సిలర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ మా వార్డులో గతంలో రోడ్లు వేసేం దుకు టెండర్లు వేసి పనులు చేయకుండ కాంట్రాక్టర్‌ తిరిగి టెండర్లలో పాల్గొంటున్నారని, ఈయనను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. 3వ వార్డు కౌన్సిలర్‌ స్వాతి మాట్లాడుతూ వార్డులో కొత్త పైపులైన వేయాలని కోరారు. ఇందుకు మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి మాట్లాడుతూ పట్టణం లో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామన్నారు.

బడ్జెట్‌కు ఆమోదం: కౌన్సిల్‌ సమావేశంలో 2025-26 బడ్జెట్‌ రూ.72,20,66,856 లతో అంచనా బడ్జెట్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. సాదారణ ఖర్చుల కింద రూ.14,83,95,00, మూలధనం ఖర్చు కింద రూ.14,16,20,000, రుణాల చెల్లింపుతో కలిపి మొత్తం ఖర్చు రూ.29, 40,15,000 లుగా చూపారు. అయితే మిగులు బడ్జెట్‌ కింద రూ.42,80, 51,856 చూపుతున్నారు. సమావేశంలో కమిషనర్‌ గంగిరెడ్డి, మేనేజర్‌ ప్రసాద్‌, డీఈలు, ఏఈలు, కౌన్సిలర్లు రాందాసుగౌడు, రాజారత్నం, కాశీం బేగ్‌, ఇసాక్‌, అమాన, బజారి పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:31 AM