రక్తమోడిన రహదారి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:42 PM
ఘోరం జరిగింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి చిన్నచూపు చూసింది. ప్రమాద రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఐచర్ లారీ, కారు ఢీ
ముగ్గురి దుర్మరణం
బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం
కోడుమూరులో విషాదం
కోడుమూరు రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఘోరం జరిగింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి చిన్నచూపు చూసింది. ప్రమాద రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఇలా.. కోడుమూరులోని కొండపేటకు చెందిన టీడీపీ నాయకుడు, 16వ వార్డు మెంబర్ మాదుగుండు సోమశేఖర్(56) మాస్టర్ వీవర్. మగ్గంలో తయారైన చీరలను గద్వాల, హైదరా బాదు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. శుక్రవారం ఉదయం వరుసకు అల్లుడైన సాయ శ్రీనివాసులు (36), మరో వ్యక్తి బండా శ్రీనివాసులు (47)తో కలిసి కర్నూలుకు బ్యాంకు పని నిమిత్తం కారులో వెళ్లారు. అక్కడ బ్యాంకులో పని ముగించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్యాలకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న ఐచర్ లారీని కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్ది ఆగింది. లారీ టైరు పేలింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడి సీటు నుంచి కదల్లేని స్థితిలో పడిపోయారు. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కారు ముందు భాగం, డోర్లను బలవంతంగా వెనక్కు లాగి క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న బండా శ్రీనివాసులు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన మాదుగుండు సోమశేఖర్, సాయ శ్రీనివాసులును కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. మరో పది నిముషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారు విగతజీవులుగా మారడం ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలిని సీఐ తబ్రేజ్, ఎస్‌ఐ శ్రీనివాసులు పరిశీలించారు.
మిన్నంటిన రోదనలు..
పట్టణ వాసులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి మృతుల భార్యాపిల్లలు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సోమశేఖర్‌కు భార్య జయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు మురళీప్రియ బీటెక్, గీత ఇంటర్ చదువుతున్నారు. సాయ శ్రీనివాసులుకు భార్య రాణి, కొడుకు మణికంఠ, కూతుళ్లు చరిత, భార్గవి ఉన్నారు. ముగ్గురు కూడా ఐదేళ్లలోపు చిన్నపిల్లలే. బండా శ్రీనివాసులుకు భార్య శ్రీలత, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో ఉదయ్ ఇంటర్, తనయ్ 7వ తరగతి చదువుతున్నారు. టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్రారెడ్డి, కుడా మాజీచైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ రఘునాథరెడ్డి బాధితులను పరామర్శించారు.
హడలెత్తిస్తున్న ప్రమాదాలు
ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తునా ్నయి. ఈ నెల 2న ప్యాలకుర్తి-కొత్తూరు గ్రామాల మధ్య బైక్ కారు ఢీ కొన్న ఘటనలో పట్టణానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రామగోవిందు, వరలక్ష్మి దంపతులు దుర్మరణం చెందారు. అలాగే 6న అదే ప్రదేశంలో కారు బోల్తా పడిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కోడుమూరు ఎస్సీ కాలనీకి చెందిన జయన్న మృతి చెందారు. ఆయన సతీమణి సంతోషమ్మతోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహం వెంట వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలు మరువకముందే శుక్రవారం కారు ప్రమాదంలో ముగ్గురు పట్టణ వాసులు మృతి చెందడం విషాదకరంగా మారింది. కోడుమూరు, ప్యాలకుర్తి, కొత్తూరు మధ్యలో డేంజర్ స్పాట్‌గా మారింది. గతంలోనూ ఈ గ్రామాల మధ్య జరిగిన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.