Share News

ఉన్న నీరు ఇదే..!

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:06 AM

గతేడాదితో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఉన్న నీరు ఇదే..!
శ్రీశైలం జలాశయంలో 847.20 అడుగులకు చేరిన నీటి నిల్వలు

కర్నూలు జిల్లా రిజర్వాయర్లలో 5.512 టీఎంసీలు

నంద్యాల జిల్లాలో 17.54 టీఎంసీలు

వేసవి గండం గట్టెక్కేనా..!?

రబీ పంటలకూ నీరివ్వాలి...

జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు

రేపు నీటి వనరులపై కలెక్టర్‌ రంజిత్‌బాషా సమీక్ష

గతేడాదితో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎండలు తీవ్రత మధ్యనే రబీ పంటలకు ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అంతర్రాష్ట్ర జలాశయాలైన శ్రీశైలం, తుంగభద్ర మినహాయిస్తే.. కర్నూలు జిల్లాలో ఐదు రిజర్వాయర్లలో 5.152 టీఎంసీలు, నంద్యాల జిల్లాలో ఆరు జలాశయాలో 17.54 టీఎంసీల నీరు ఉంది. వివిధ కాలువల పరిధిలో రబీ పంటలు చేతికి రావాలంటే నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా.. నీటి వృఽథాను అరికడితే వేసవి నీటిఎద్దడి తలెత్తకుండా ప్రజల దాహం తీర్చవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నీటి నిల్వలపై కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా గురువారం జలవనరుల శాఖ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపఽథ్యంలో వివిధ జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కేసీ కెనాల్‌, టీబీపీ ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, ఎస్సార్బీసీ, ఎన్టీఆర్‌ తెలుగుగంగ కాలువ పరిధిలో దాదాపుగా 3.36 లక్షల ఎకరాల్లో రబీ ఆయకట్టు సాగులో ఉంది. హంద్రీ నీవా కాలువ కింద రైతులు మరో 17 వేలు సాగు చేశారు. వివిధ దశల్లో ఉన్న రబీ పంటలు చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కర్నూలు జిల్లాల్లో గాజులదిన్నె, సుంకేసుల, కృష్ణగిరి, పత్తికొండ, పులికనుమ జలాశ యాల్లో 5.152 టీఎంసీలు, నంద్యాల జిల్లాలో వెలుగోడు, గోరుకల్లు, అవుకు, జుర్రేరు, వరద రాజుస్వామి గుడి, అలగనూరు జలాశయాల్లో 17.54 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది మే వరకు ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండడంతో వేసవి నీటి ఎద్దడి నుంచి గట్టెక్కే అవకాశం ఉన్నా.. నీటి వృఽథాను అరికట్టడంతో పాటు నీటి పొదుపు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండడదని, ఇప్పటి నుంచి నీటి వినియోగంపై పక్కా ప్రణాళికలు రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు.

శ్రీశైలంలో 74.45 టీఎంసీల నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 74.15 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నీటిని వినియోగిం చుకోవాలంటే కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆమోదం ఉండాలి. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలకు గాను.. 847.20 అడుగుల్లో 74.15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇటీవల జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో శ్రీశైలం నుంచి ఏపీ నీటి వినియోగం అపేయాలని సూచించడంతో ప్రస్తుతం మాల్యాల పంప్‌హౌస్‌ నుంచి కేసీ కాలువకు 675 క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువకు 674 క్యూసెక్కులు మాత్రమే తీసుకుంటున్నారు. ఏ క్షణమైనా ఎత్తిపోతలు ఆపేయవచ్చని అంటున్నారు. అదే జరిగితే సాగులో ఉన్న పంటల దిగుబడి ప్రశ్నార్థకంగా మారుతుంది. కేసీ కింద 92 వేల ఎకరాలు సాగులో ఉంది. ఎస్సార్బీసీ పరిధిలో 98 వేల ఎకరాలు, తెలుగుగంగ కాలువ పరిధిలో 1.14 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నాయని ఇంజనీర్లే అంటున్నారు. గోరుకల్లు, వెలుగోడు, అవుకు జలాశయాల్లో 17.281 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో వినియోగిస్తే వేసవిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

గాజులదిన్నె ఆధారం:

కర్నూలు జిల్లాలో కర్నూలు నగరం సహా వివిధ గ్రామాలు, నంద్యాల జిల్లాలో డోన్‌ పట్టణాలకు వేసవి దాహం తీర్చే ప్రాణనాడి గాజులదిన్నె జలాశయం. గత ఏడాది అడుగంటిపోయింది. ఈ ఏడాది టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, ఇంజనీర్లు ముందస్తు ప్రణాళికతో హంద్రీనీవా కాలువ, టీబీపీ ఎల్లెల్సీ నుంచి నీటిని తీసుకొని గాజలదిన్నె ప్రాజెక్టులో నిల్వ చేశారు. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 377 మీటర్లు, పూర్తిస్థాయి సామర్థ్యం 4.5 టీఎంసీలకు కాగా.. 374.89 మీటర్లలో 2.57 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అందులో లైవ్‌ కెపాసిటీ 1.92 టీఎంసీలు. కుడి ఎడుమ కాలువల కింద 12,300 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ పంటలు చేతికి రావాలంటే 0.90 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మిగిలిని ఒక టీఎంసీ నీటితో వేసవిలో పుష్కలంగా తాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయితే.. నీళ్లు ఉన్నాయి కదా అని విచ్చలవి డిగా వాడేస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. హంద్రీనీవా పరిధిలో కృష్ణగిరి రిజర్వాయర్‌లో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశ యంలో 0.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులికనుమ జలాశయంలో 0.79టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.

తుంగభద్రలో 5.61 టీఎంసీలు నీటి వాటా:

రాయలసీమకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం ఆశాజనకంగా నీటి నిల్వలు ఉన్నాయి. గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 105.78 టీఎంసీలుగాను.. 1606.14 అడుగుల వద్ద 30.57 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది 198 టీఎంసీలకు లెక్క గట్టి కేసీ నీటి వాటా 10 టీఎంసీలకు గాను 9.34 టీఎంసీలు కేటాయించారు. అందు లో 3.50 టీఎంసీలు హెచ్చెల్సీ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు మళ్లించారు. ఇప్పటికే 4.23 టీఎంసీలు కేసీసీ వాటాగా వాడుకు న్నారు. మిగిలిన 1.61 టీఎంసీలు విడుదల చేయాలని ఇండెంట్‌ ఇచ్చారు. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) నీటి వాటా 24 టీఎంసీలు కాగా 2024-25 నీటి సంవత్సరంలో 22.53 టీఎంసీలు కేటాయించారు. ఇప్పటికే 17.53 టీఎంసీలు వినియోగించుకోగా.. 5 టీఎంసీలు మిగులు వాటా ఉందని ఇంజనీర్లు తెలిపారు. సాగులో ఉన్న 45 వేల ఎకరాలకు 4 టీఎంసీలు ఇచ్చినా.. వేసవి తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ నీరు ఉంటుందని అంటున్నారు. సుంకేసులలో ప్రస్తుతం 0.881 టీఎంసీలు ఉందని, తుంగభద్ర డ్యాం నుంచి 153 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉందని ఇంజనీర్లు తెలిపారు. మార్చి 31 నాటికి కనిష్ఠంగా 0.60 టీఎంసీలు నిల్వ ఉంచినా కర్నూలు నగర ప్రజలకు వేసవి నీటి ఎద్దడి తలెత్తకుండా తాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీర్లు తెలిపారు.

6న నీటి నిల్వలపై కలెక్టర్‌ సమీక్ష

రబీలో పంటల అవసరం, వేసవిలో తాగునీటి సరఫరా, ప్రస్తుతం ఆయా జలాశ యాల్లో ఉన్న నీటి నిల్వలపై సమీక్షించేందుకు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా గురువారం జలవన రుల శాఖ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

జలాశయాల వారిగా పూర్తి వివరాలతో రావాలని ఇంజనీర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశానికి గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఇంజనీర్లను కూడా పిలిస్తే.. రెండు శాఖల ఇంజనీర్ల మధ్య సమన్వ యం ఏర్పడుతుందని, ఎల్లెల్సీ పరిధిలో ఎస్‌ఎస్‌ ట్యాంకులలో నీటిని నింపేందుకు ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

కర్నూలు జిల్లాలో నీటి నిల్వలు (టీఎంసీలు)

జలాశయం గరిష్టం ప్రస్తుతం

గాజులదిన్నె 4.5 2.57

సుంకేసుల 1.20 0.881

క్రిష్ణగిరి 0.164 0.161

పత్తికొండ 1.126 0.75

పులికనుమ 1.243 0.79

మొత్తం 8.533 5.152

నంద్యాల జిల్లాలో నీటి నిల్వలు (టీఎంసీలు)

జలాశయం గరిష్టం ప్రస్తుతం

వెలుగోడు 16.95 6.536

గోరుకల్లు 12.5 8.92

అవుకు 4.14 1.895

జుర్రేరు 0.266 0.12

వరదరాజస్వామి 0.389 0.148

అలగనూరు 2.965 --

మొత్తం 37.213 17.549

అంతర్‌రాష్ట్ర జలాశయాల్లో

నీటి నిల్వలు (టీఎంసీలు)

శ్రీశైలం 215.80 75.47

తుంగభద్ర 105.78 32.49

Updated Date - Mar 05 , 2025 | 12:06 AM