జిల్లా ఓటర్లు 20,62,569
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:27 AM
జిల్లా ఓటర్ల తుది జాబితా-2025 విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలు వెల్లడయ్యాయి

తుది ఓటరు జాబితా ప్రచురణ
కర్నూలు కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఓటర్ల తుది జాబితా-2025 విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలు వెల్లడయ్యాయి. నూతన జాబితా తయారీలో భాగంగా గతేడాది ఆగస్టు 20 నుంచి అక్టోబరు 18 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించారు. మృతులు, వలస ఓటర్ల తొలగింపుతో పాటు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువకులకు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలల పాటు కొనసాగిన సర్వేతో పాటు ఆన్‌లైన్‌లో వచ్చిన క్లెయిమ్‌లపైనా విచారణ చేపట్టారు. ఆ వివరాలతో గతేడాది అక్టోబరులో ముసాయిదా జాబితా విడుదల చేశారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్తగా చేర్పులు, తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను విచారించిన జిల్లా ఎన్నికల అధికారులు సోమవారం తుది జాబితాను ప్రచురించారు. మొత్తం 20,62,569 మంది ఓటర్లు వెల్లడించారు.
27,927 ఓటర్ల నమోదు
18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్ల నమోదు స్పెషల్‌సమ్మరి రివిజన్‌లో భాగంగా కర్నూలు నియోజకవర్గంలో 3,430, పాణ్యం నియోజకవర్గంలో 4,866, పత్తికొండ నియోజకవర్గంలో 3,514, కోడుమూరు నియోజకవర్గంలో 3,432, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3,600, మంత్రాలయం నియోజకవర్గంలో 2,831, ఆదోని నియోజకవర్గంలో 3,146, ఆలూరు నియోజకవర్గంలో 3,108 ఓటర్లు నమోదయ్యారు. అదేవిదంగా సర్వీసు ఓటర్లు 1,615, పీడబ్ల్యూటీ ఓటర్లు 23,908, అలాగే 80 సంవత్సరాలు దాటిన ఓటర్లు 27208, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 123 నమోదయ్యారు.