Share News

రీసర్వే పకడ్బందీగా చేయాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:23 PM

జిల్లాలో భూ రీసర్వేను పక్కాగా నిర్వహించాలని మండల, గ్రామస్థాయిలో సర్వేయర్లు, వీఆర్వోలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ ఆదేశించారు.

రీసర్వే పకడ్బందీగా చేయాలి
ఆవులపల్లె గ్రామంలో రీసర్వేను పరిశీలిస్తున్న నంద్యాల జేసీ విష్ణుచరణ్‌

జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌

చాగలమర్రి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ రీసర్వేను పక్కాగా నిర్వహించాలని మండల, గ్రామస్థాయిలో సర్వేయర్లు, వీఆర్వోలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని ఆవులపల్లె గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూముల రికార్డులను, భూ కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల్లో భూ రీసర్వే పనులు ప్రారంభించామని అన్నారు. మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రీసర్వే చేస్తున్నామని అన్నారు. ఒక్కో గ్రామానికి 7 బ్లాక్‌లుగా విభజించి రోజుకు 20 నుంచి 25 ఎకరాలు సర్వే చేసేలా ప్రణాళిక చేశామని అన్నారు. మండల సర్వేయర్‌తో పాటు గ్రామ సర్వేయర్లతో రెండు టీమ్‌లుగా ఏర్పాటు చేసి రైతుల సమక్షంలో రోవర్‌తో భూ రీసర్వే చేస్తున్నామని అన్నారు. రైతులకు ముందుగానే నోటీసులు అందజేస్తామని అన్నారు. అందుబాటులో లేని రైతులకు ఫోన్‌ వాట్సాప్‌ ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. చాగలమర్రి మండలంలో నేలంపాడు, ఆవులపల్లె గ్రామాల్లో 1175 పట్టాభూములు, 170 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామని అన్నారు. సర్వే నంబర్‌ల ఆధారంగా భూములు కొలతలు తీస్తున్నామని అన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరుగకుండా ఉండేలా భూ కొలతలు తీస్తున్నారని తెలిపారు. గతంలో జరిగిన భూ రీసర్వేలో రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తిరిగి ప్రత్యేకంగా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు రావడంతో తిరిగి గ్రామాల్లో భూ రీసర్వే పనులు జనవరి నుంచి ప్రారంభించామన్నారు. రెవెన్యూ సదస్సులు, భూ రీసర్వే గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి అర్జీలను స్వీకరించామన్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, డీటీ విజయ్‌కుమార్‌, డిప్యూటీ సర్వేయర్ల ఇన్‌స్పెక్టర్‌ నీలకంఠం, మండల సర్వేయర్‌ మద్దిలేటి, ఆర్‌ఐ అబ్దుల్‌సత్తార్‌, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, కార్యదర్శులు, వీఆర్‌ఏలు, రైతులు పాల్గొన్నారు.

పేదల ఇళ్ల పట్టాల కొనుగోలుపై విచారణ

ప్రభుత్వం మంజూరు చేసిన పేదల ఇళ్ల పట్టాలను కొనుగోలు చేసిన వాటిపై విచారణ చేపడతామని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తెలిపారు. ఇళ్ల పట్టాలను కొనుగోలు చేసి ఉంటే వాటిని రద్దు చేస్తామన్నారు.

బ్రాహ్మణపల్లె వంతెన పనులు చేపట్టాలి

వక్కిలేరు వాగుపై వంతెన పనులు చేపట్టాలని ఆవులపల్లె, బ్రాహ్మణపల్లె గ్రామాలకు చెందిన ప్రజలు జేసీ విష్ణుచరణ్‌కు గురువారం విన్నవించుకున్నారు. లో లెవెల్‌ వంతెన ఉండటంతో ప్రతి ఏడాది వరద నీటితో రాకపోకలతో స్తంభించి ఇబ్బంది పడుతున్నామని అన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:23 PM