చిన్నారిని చిదిమేసిన లారీ
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:12 AM
పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టిస్ చేసేందుకు ఆ చిన్నారి ఉత్సాహంతో ఉదయమే లేచి స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. నాన్న... నన్ను స్కూల్ వద్ద వదిలిపెట్టు....అనడంతో ఆ తండ్రి బైక్‌పై తన కుమారుడిని దిగబెట్టేందుకు బయలుదేరాడు.

కన్నబిడ్డ మృతితో తండ్రి షాక్
లారీతో పరారీ అయిన డ్రైవర్
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టిస్ చేసేందుకు ఆ చిన్నారి ఉత్సాహంతో ఉదయమే లేచి స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. నాన్న... నన్ను స్కూల్ వద్ద వదిలిపెట్టు....అనడంతో ఆ తండ్రి బైక్‌పై తన కుమారుడిని దిగబెట్టేందుకు బయలుదేరాడు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ చిన్నారిని చిదిమేసింది. కళ్ల ఎదుటే బిడ్డ లారీ చక్రాల కింద ఛిద్రమై ప్రాణాలు వదలడం చూసిన తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడు. ఈ దారుణం ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు సర్కిల్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణంలోని ఎల్బీస్టేట్‌కి చెందిన గురురాజా, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆర్ట్స్ కళాశాల రహదారిలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో మొదటి అబ్బాయి సత్యనారాయణ 9వ తరగతి, రెండో అబ్బాయి ఆదిత్య నారాయణ(10) ఐదో తరగతి చదువుతున్నారు. పాఠశాల వార్షికోత్సవం మంగళవారం జరగనుండడంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం విద్యార్థులు సిద్ధపడుతున్నారు. ఆదివారం పాఠశాలలో ప్రాక్టిస్ ఉండటంతో నాన్న..నన్ను పాఠశాల వద్దకు దించు అనడంతో ఆ తండ్రి తన బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరారు. ఎమ్మిగనూరు సర్కిల్ సమీపంలోని కృష్ణ గుడి వద్దకు రాగానే అతి వేగంగా ఆర్ట్స్ కళాశాల రహదారి వైపు నుంచి లారీ దూసుకొచ్చింది. ఇరుకైనా రహదారి కావడం ఇరుపక్కల వాహనాలు ఉండడం బైకుపై తండ్రి, కొడుకులు ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీని చూసి ఒక్కసారిగా బ్రేకులు వేశారు. బైకు అదుపు తప్పడంతో తండ్రి ఎడమవైపు పడగా, కుమారుడు ఆదిత్య నారాయణ కుడివైపునకు ఒరిగి కిందపడ్డాడు. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ విద్యార్థి ఆదిత్యనారాయణ తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేస్తూ పరుగులు తీశారు. అక్కడి నుంచి లారీతో పాటు డ్రైవర్ పరారయ్యాడు. తండ్రి షాక్ నుంచి తేరుకొని నాన్నా.. ఆదిత్య ఒక్కసారిలేగునాన్నా.. అంటూ గుండెలు బాదుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి సంఘటన స్థలానికి చేరుకొని రక్తపుమడుగులో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగి కుప్పకూలిపోయింది. స్కూల్‌ల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అయిన వెంటనే వస్తానని చెప్పి ఇలా కనిపించకుండా కానరాని లోకాలకు వెళ్లావా అంటూ తల్లి రోదిస్తుండడంతో స్థానికుల అందరిని కంటితడి పెట్టించింది. వెంటనే 108 వాహనంలో మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. లారీతో డ్రైవర్ పరారీ కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.