Share News

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:24 AM

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘం, సీఐటీయూ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు జయరాజు, యోగప్ప, వీరేశ్‌, అనిల్‌కుమార్‌, ప్రాణేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి
ఎమ్మిగనూరులో ప్రతులను కాల్చివేస్తున్న నాయకులు

మంత్రాలయం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘం, సీఐటీయూ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు జయరాజు, యోగప్ప, వీరేశ్‌, అనిల్‌కుమార్‌, ప్రాణేశ్‌ డిమాండ్‌ చేశారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని వికసిత్‌ భారత్‌ జీరామ్‌జీ పథకంగా అమలు చేయడం సరికాదని తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు తీవ్రనష్టం కలిగించే జీరామ్‌జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజులు పనిదినాలు కల్పించి కేంద్ర బడ్జెట్‌లో రెండున్నర లక్షల కోట్లు కేటాయంచి పేదలను ఆదుకోవాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు రాఘవేంద్రకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు రామన్న, నరసింహులు కాశీం, బాబు, తాయన్న, ఈరన్న పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు టౌన్‌: ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం దారుణమని సీపీఎం పట్టణ కార్యదర్శి గోవిందు అన్నారు. ఈ సందర్భంగా శనివారం గాంధీ సర్కిల్‌లో రాముడు అధ్యక్ష తన ప్రజా సంఘాల నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టానికి నిధులను తగ్గిస్తూ వచ్చిందన్నారు. మహాత్మగాంధీ పేరు తొలగించడం అవమానకరమని అన్నారు. గతంలో కేంద్రం 90శాతం నిధులు, రాష్ట్రం 10శాతం నిధులు కేటాయించేవి, ఈ కొత్త స్కీమ్‌తో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు స్కీమ్‌ ప్రతులను కాల్చివేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సురేశ్‌, రమేశ్‌, కృష్ణ, లక్ష్మి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: ఉపాధి హామీ పథకాన్ని పేర్చుమార్చడం సరికాదని వామపక్ష నాయకులు రంగన్న, రాముడు, రాజు లు అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం వామపక్షాల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే ఉపసంహరించు కోవాలన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:25 AM