Share News

విజయ డెయురీ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:50 PM

విజయ డెయురీ వద్ద ఉద్రిక్తత

విజయ డెయురీ వద్ద ఉద్రిక్తత
ఆందోళన చేస్తున్న భూమా వర్గీయులు, టీడీపీ నాయకులు, పాల రైతులు..

నంద్యాలలో భూమా వర్గీయుల ఆందోళన

ఆగిన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ

అధికారంతో వాయిదా వేయించారని వైసీపీ ఆరోపణలు

నంద్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల విజ య డెయిరీ డైరెక్టర్‌ పదవుల ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గీయులు ఆందోళనకు దిగడంతో తాత్కాళికంగా వాయిదా వేశారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందించారు. అధికార బలం ఉందని నామినేషన్‌ ప్రక్రియను టీడీపీ నాయకులు వాయిదా వేయించారని ఆరోపించారు.

ఉదయం నుంచే హైటెన్షన్‌

పాణ్యం నియోజకవర్గం నెరవాడ సొసైటీ అధ్యక్షురాలు సరళమ్మ, ఆళ్లగడ్డ నియోజకవర్గం గంగవరం అధ్యక్షులు ఉడత రమణ, బనగానపల్లి నియోజకవర్గం గిద్దలూరు సొసైటీ అధ్యక్షులు కామిరెడ్డి చెన్నారెడ్డిలకు చెందిన పదవీ కాలం మూడు వారాల కిందట ముగిసింది. దీంతో ఈ మూడు స్థానాలకు శుక్రవారం నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే డైరెక్టర్‌ పదవులను అక్రమంగా పాలకవర్గం రద్దు చేసిందని భావించి ఇదివరకే భూమి జగత్‌ విఖ్యాత్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే భూమా వర్గీయులు, పలువురు టీడీపీ నాయకులు, పాల రైతులు ఉదయాన్ని డెయిరీ వద్దకు చేరుకున్నారు. కొందరు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చారు. అయితే నామినేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని భూమా వర్గీయులు ఆందోళనకు దిగారు. చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో పాటు డెయిరీ లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తమ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో డెయిరీ వద్దకు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలు వస్తే లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించారు. వెంటనే డెయిరీ ఎన్నికల అధికారితోపాటు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాత్కాలిక వాయిదా వేస్తున్నామని ఎండీ ప్రదీప్‌కుమార్‌ మీడియాకు వివరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

నిరాశతో వెనక్కివెళ్లిన అభ్యర్థులు...

నామినేషన్‌ ప్రక్రియ వాయిదా వేయడంతో అభ్యర్థులు నిరాశతో వెనక్కి వెళ్లారు. ఆయితే కొందరు మాత్రం ఉదయం 10 గంటలకు వచ్చారు. వారి లో బనగానపల్లెకు చెందిన గిరిదేవి, పాణ్యంకు చెందిన మాజీ డైరెక్టర్‌ సరళ మ్మ, బండిఆత్మకూరు మండలానికి చెందిన చౌడేశ్వరి, బేతంచెర్ల మండలా నికి చెందిన ఆచారిలు డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్‌ వేయడానికి వచ్చారు. ఆయితే వీరిలో కొందరికి బలపరిచే అభ్యర్థులు లేకపోవడం గమనార్హం.

అధికారంతో వాయిదా వేయించారు..

అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని విజయ డెయిరీకి చెందిన ఎన్నికల నామినేషన్‌ పక్రియను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాయిదా వేయించారని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. డెయిరీకి సమీపంలోని ఓ హోటల్‌లో వారు మాట్లాడారు. పాల ఉత్పత్తిదారులు కాకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడం దారుణమని వారి దౌర్జాన్యానికి నిదర్శమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. అధికారం కలకాలం ఉండదనే విషయాన్నే టీడీపీ నాయకులు గ్రహించాలని గుర్తు చేశారు.

లా అండ్‌ ఆర్డర్‌ సమస్యతో వాయిదా వేశాం..

మూడు డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్‌ దాఖలు పక్రియ చేపట్టాం. ఆయితే పోలీసుల లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఉందని మా దృష్టికి తెచ్చారు. దీంతో తాత్కా లికంగా ఎన్నికల నామినేషన్‌ పక్రియను వాయిదా వేశాం. ఎప్పుడు నిర్వహించేది తర్వాత చెబుతాం. నిబంధనలకు లోబడే ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.

-డెయిరీ ఎండీ ప్రదీప్‌ కుమార్‌

Updated Date - Jan 17 , 2025 | 11:50 PM