Share News

మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను..!?

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:51 PM

మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను..!?

మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను..!?

ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి 22కు చేరిన బలం

మరో ఆరుగురు వస్తే కుర్చి టీడీపీ సొంతం

టీడీపీ నేతల టచ్‌లో పలువురు వైసీపీ కార్పొరేటర్లు

మేయర్‌ రామయ్యకు పదవీ గండం తప్పదా..?

కర్నూలు నగర పాలక సంస్థ మేయర్‌ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా..? తాజాగా రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తే నిజమే అనిపి స్తోంది. మరో ఏడాది పదవీ కాలం ఉన్న మేయర్‌ పీఠం కోసం టీడీపీ కన్నేసింది. ఎలాగైనా ఆ పీఠంపై బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్పొరేటర్‌ను కూర్చొబెట్టేందుకు ఆ పార్టీ నాయ కులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముందుగా పాలకవర్గంలో బలం పెంచుకుంటు న్నారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీ బలం 22 సభ్యులకు చేరింది. పదవి దక్కాలంటే ఆరుగురు సభ్యుల బలం కావాలి. ఇప్పటికే పలువు రు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. తాజాగా రెండు రోజుల క్రితం టీడీపీకి టచ్‌లోకి వచ్చిన వైసీపీ కార్పొరేటర్లలో టీడీపీ కార్పొరేటర్లు ఓ రైస్‌ మిల్లులో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌, తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవులను టీడీపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కర్నూలు మేయర్‌ రామయ్యపై అవిశ్వాసం తప్పదంటూ నగరంలో జోరుగా చర్చ సాగుతోంది.

కర్నూలు న్యూసిటీ/కర్నూలు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థగా 1994లో ఏర్పడింది. 1995లో జరిగిన తొలి మేయర్‌ ఎన్నికల్లో నాటి టీడీపీ అభ్యర్థి బంగి అనంతయ్య విజయం సాధించి మేయర్‌ పీఠంపై కూర్చున్నారు. 2000లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి మేయర్‌గా ఫిరోజ్‌బేగం బాధ్యతలు చేపట్టారు. 2005లో జరిగిన ఎన్నికల్లో కూడా రెండో పర్యాయం కాంగ్రెస్‌ విజయం సాధించి మేయర్‌ పదవిని ఎస్‌.రఘురామిరెడ్డి దక్కించుకున్నారు. ఆ తరువాత పదేళ్లు ఎన్నికలు జరగలేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మేయర్‌గా బీవై రామయ్య బాధ్యతలు చేపట్టారు. 52 వార్డులు (డివిజన్లు) కలిగిన కర్నూలు కార్పొరేషన్‌లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ వైసీపీ 43 విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు ఆరుగురు, ఆ పార్టీ మద్దతుతో ముగ్గురు కలిపి 9 మంది విజయం సాధించారు.

వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో 19వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించిన బీవై రామయ్య మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ మేయర్లుగా ఎస్‌.రేణుక, ఎన్‌.అరుణ బాధ్యతలు చేపట్టారు. 52 వార్డుల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 33, పాణ్యం నియోజకవర్గం పరిధిలో 16, కోడుమూరు నియోజకవర్గం పరిధిలో మూడు డివిజన్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం, నగర అభివృద్ధి కోసం వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా టీడీపీ గొడుగు నీడలో చేరడంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం బలహీనమవుతూ వస్తోంది.

22 సంఖ్యకు చేరిన టీడీపీ బలం

కార్పొరేషన్‌ పాలకవర్గంలో 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించుకున్నారు. వీరితో కలిపితే కౌన్సిల్‌లో ఓటు హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 55కు చేరింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కించుకోవాలంటే 28 మంది సభ్యుల బలం ఉండాలి. వాస్తవంగా టీడీపీకి 9 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎన్నికల ముందు, ఆ తరువాత మరో 10 మది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరడంతో 19 మందికి చేరింది. వీరితో పాటు ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపితే టీడీపీ బలం 22కు చేరింది. 43 కార్పొరేటర్లు కలిగిన వైసీపీ ప్రస్తుతం బలం 33కు పడిపోయింది. టీడీపీ బలం పెరగడంతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది.

అవిశ్వాసానికి రంగం సిద్ధమైందా..?

2021 మార్చి 18న మేయర్‌ బీవై రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. 2026 మార్చి 17 వరకు అంటే ఏడాది పదవీ కాలం ఉంది. ఎలాగైనా సరే రామయ్యను పదవి నుంచి దింపేయాలని టీడీపీ ముఖ్య నాయకులు తెర వెనుక రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. అధికారంలో ఉండగా మేయర్‌ రామయ్య తమను కనీసం కార్పొరేటర్లుగా గుర్తించి గౌరవం ఇవ్వలేదని, ఆయన ఆ పదవిలో ఉంటే చూడలేకపోతున్నామని, అవిశ్వాసం పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతలకు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు ఓ రైస్‌ మిల్లు కేంద్రంగా అత్యవసర భేటీ కావడంతోపాటు మేయర్‌పై అవిశ్వాసంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రామయ్యను పదవి నుంచి దింపేందుకు రంగం సిద్ధమైందని చర్చ జరుగుతోంది. అయితే అవిశ్వాసానికి ముందే బీవై రామయ్య తన పదవికి రాజీనామా చేస్తారని కూడా పలువురు చర్చించుకోవడం గమనార్హం.

అవిశ్వాసం పెడితే..

మేయర్‌ బీవై రామయ్యకు పదవి గండం తప్పదా..? నగరంలో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. 9 మంది సభ్యుల బలం కలిగిన టీడీపీ.. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి 22 సభ్యులకు చేరింది. అవిశ్వాసం ద్వారా మేయర్‌ను పదవి నుంచి దింపేయాలి అంటే.. అవిశ్వాసం పెట్టిన రోజు కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సగం కంటే ఒకరు ఎక్కువ మెజార్టీ సాధించాలి. అప్పుడు మేయర్‌ అవిశ్వాసం నెగ్గి పదవి కాపాడుకున్నట్లే. సగం కంటే ఒకరు తక్కువైతే పదవి కౌన్సిల్‌ విశ్వాసం కోల్పోయినట్లే. మేయర్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే మేయర్‌ ఎన్నికల్లో కొత్తగా మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం మేయర్‌ రామయ్య పదవి కాపాడుకోవాలంటే 28 మంది సభ్యుల బలం కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి 33 మంది సభ్యులు ఉన్నా.. వారిలో ఆరేడుగురు టీడీపీ ముఖ్య నాయకులకు టచ్‌లో వెళ్లినట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెడితే వారంతా టీడీపీకి మద్దతు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే వైసీపీ బలం 25-26కు పడిపోతుంది. మేయర్‌ అవిశ్వాసంలో ఓడిపోక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:51 PM