Share News

ఏటీఎంలే టార్గెట్‌

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:04 AM

వారంతా బంధువులే. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు వారి బంధువులు. కంటైనర్‌ డ్రైవింగ్‌ పనుల కోసం వచ్చామని చెప్పుకునేవారి అసలైన ప్రవృత్తి చోరీలు చేయడం. అందులోనూ ఏటీఎం సెంటర్లనే టార్గెట్‌ చేసుకుంటూ ఏకంగా ఏటీఎం యంత్రాలను దోచుకెళ్లేవారు. ఇటీవలి కాలంలో కర్నూలు జిల్లాలో వరుస చోరీలు జరగడంపై పోలీసులు నిఘా ఉంచి ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌ చేశారు.

ఏటీఎంలే టార్గెట్‌
చోరీకి ఉపయోగించిన పరికరాలను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

డ్రైవర్లుగా వచ్చి దోపిడీలు

పోలీసుల అదుపులో హరియాణ దొంగలు

పట్టించిన సీసీ కెమెరాలు

తండ్రీకొడుకులు, మామ అల్లుళ్ల అరెస్ట్‌

కర్నూలు క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వారంతా బంధువులే. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు వారి బంధువులు. కంటైనర్‌ డ్రైవింగ్‌ పనుల కోసం వచ్చామని చెప్పుకునేవారి అసలైన ప్రవృత్తి చోరీలు చేయడం. అందులోనూ ఏటీఎం సెంటర్లనే టార్గెట్‌ చేసుకుంటూ ఏకంగా ఏటీఎం యంత్రాలను దోచుకెళ్లేవారు. ఇటీవలి కాలంలో కర్నూలు జిల్లాలో వరుస చోరీలు జరగడంపై పోలీసులు నిఘా ఉంచి ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌ చేశారు. చోరీలకు పాల్పడుతున్న హరియాణ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసి గురువారం అరెస్టు చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు చంద్రబాబు నాయుడు, శేషయ్య, వంశీధర్‌లు విలేకరుల సమావేశంలో వివరా లను వెల్లడించారు. హరియాణ రాష్ట్రం మేవాత్‌ జిల్లాకు చెందిన జంషాద్‌ ఖాన్‌, షౌకర్‌ ఖాన్‌లు తండ్రీకొడుకులు. అదేవిధంగా జంషాద్‌ ఖాన్‌, షాహీద్‌ ఖాన్‌ మామ అల్లుళ్లు. వీరితో పాటు పాల్వాల్‌ జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌లు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. వీరిలో షాహీద్‌ఖాన్‌ 26 చోరీలు చేయగా.. ఇమ్రాన్‌ఖాన్‌ 15 చోరీలు చేశాడు. జంసాద్‌ఖాన్‌, షావ్‌ఖార్‌ ఖాన్‌ కలిసి పదేసి చోరీలు చేశారు. షాహీద్‌ఖాన్‌కు ఇద్దరు బార్యలు, ఆరుగురు కొడుకులు. వీరంతా తమ కుటుంబ పోషణ కోసమే నేరాలకు పాల్పడేవారు.

ఆ రోజు ఏంజరిగింది..?

గత నెల 24న చిన్నటేకూ రు గ్రామ సమీపంలో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చెందిన ఏటీఎం సెంటరు మిషన్‌ను చోరీ చేశారు. ఓ టోయింగ్‌ వాహనంతో ఏటీఎంను తాళ్లతో కట్టి కొంత దూరం లాక్కెళ్లారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులతో పాటు యువకులు ఈ టోయింగ్‌ వాహనాన్ని వెంబడించడంతో నలుగురు నిందితులు పరారయ్యారు. అంతకు ముందు రోజు కూడా కృష్ణానగర్‌ సమీపంలో ఓ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ర్పే చేయడంతో ప్రధాన కేంద్రంలో అలారం మోగడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడకు చేరుకోవడంతో గమనించి నిందితులు పరారయ్యారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వర్యంలో త్రీటౌన్‌ సీఐ శేషయ్య, రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, దేవనకొండ సీఐ వంశీధర్‌, సైబర్‌ క్రైం ల్యాబ్‌ సీఐ వేణుగోపాల్‌, ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్‌, ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు.

దర్యాప్తు ఇలా..

కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బందంగా ఏర్పడ్డారు. టోల్‌ గేట్లతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. అమకతాడు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ కంటైనర్‌ వాహనాన్ని గుర్తించి సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ద్వారా దర్యాప్తు ముమ్మరం చేశారు. సెల్‌టవర్‌ డంప్‌ ఆధారంగా నిందితులు బెంగుళూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అరెస్టు చేసి వారి నుంచి గ్యాస్‌ కట్టర్‌, చిన్నగ్యాస్‌ సిలిండర్‌, రెండు కత్తులు, తాళాలకు ఉపయోగించే దొంగ తాళాలు, మాస్కులు, గ్లౌజ్‌లు, రెండు స్ర్పే పిన్నులు స్వాధీనం చేసుకున్నారు.

ఎలా చేశారంటే

జంషాద్‌ఖాన్‌, షౌకర్‌ ఖాన్‌ కార్లు, బైకులను ట్రాన్స్‌పోర్టులు చేసే కంటైనర్‌ కంపెనీలో డ్రైవర్లుగా చేరారు. దిన్నెదేవరపాడు సమీపంలో ఉన్న సుజుకీ షోరూంకు కొన్ని కార్లను కంటైనర్‌లో తీసుకువచ్చారు. ఎప్పటి మాదిరిగానే దొంగతనం చేయాలని నిశ్చయించుకుని కంటైనర్‌లో నలుగురు వచ్చారు. షోరూంలో కార్లను అన్‌లోడు చేసిన తర్వాత హైదరాబాదు మార్గంలో కొంత దూరం వెళ్లి తమకు అనుకూలమైన ఏటీఎం కేంద్రాల్లో రెక్కి నిర్వహించారు. దీంతో పాటు మార్గమధ్యంలో వస్తూనే జాతీయ రహదారిలో చిన్నటేకూరులో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎంపై వీరి కన్ను పడింది. ముందుగా కృష్ణనగర్‌ ఏటీఎం చోరీకి ప్రయత్నించి విఫల మయ్యారు. దీంతో ఆ మరుసటి రోజు బళ్లారి చౌరస్తా సమీ పంలో ఓ టోయింగ్‌ వాహనాన్ని చోరీ చేశారు. చిన్న టేకూరు వద్దకు వెళ్లి తమ కంటైనర్‌ను ఉలిందకొండ క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న హమారా ఘర్‌ డాబా ఎదుట నిలిపారు. తీరా అక్కడి నుంచి టోయింగ్‌ వాహ నంలో వెనక్కి వచ్చి చిన్నటేకూరు సమీపంలో ఉన్న ఏటీఎం ను చోరీ చేశారు. అటువైపుగా వెళ్తున్న కొందరు యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆ యువకులు కలిసి టోయింగ్‌ వాహనాన్ని వెంబడించడంతో ఉలిందకొండ క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాన్ని అక్కడే వదిలేసి పరారై అరకిలోమీటరు దూరంలో ఉన్న కంటైనర్‌ను ఎక్కి పరారయ్యారు.

Updated Date - Mar 07 , 2025 | 12:04 AM