పరీక్ష కేంద్రాలపై నిఘా
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:35 PM
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ రంజిత్ బాషా సిబ్బందిని ఆదేశించారు.
పొరపాట్లుకు తావు ఉండకూడదు
ఆదేశించిన కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ రంజిత్ బాషా సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక ఉస్మానియా కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇంటర్ అధికారులను ఆదేశించారు. మార్చి1 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల కోసం 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 45,325 మంది ఉన్నారన్నారు. అందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 23,098 మంది కాగా, రెండో సంవత్సరం విద్యార్థులు 22,227 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి పూర్తి నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 25,250 మంది నమోదు చేసుకోగా, 24,495 మంది హాజరయ్యారని, 744 మంది గైర్హాజరయ్యారని అన్నారు. కర్నూలు బీ. క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐవో గురువయ్య శెట్టి, డీవీఈవో పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ లాలెప్ప పర్యవేక్షించారు.