కనుల పండువగా ‘శ్రీరాములోరి శోభాయాత్ర’
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:10 AM
అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని సీతారాముల కల్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘శ్రీరాముల వారి శోభాయాత్ర’ కనుల పండుగా నిర్వహించారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కర్నూలు కల్చరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని సీతారాముల కల్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘శ్రీరాముల వారి శోభాయాత్ర’ కనుల పండుగా నిర్వహించారు. సమితి నాయకులతో పాటూ, వివిధ ఆలయాల ధర్మకర్తలు, ధార్మిక సంస్థ ప్రతినిధులు, భక్తులు వేలాదిగా తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. పాత నగరంలోని జమ్మిచెట్టు సమీపంలోగల లలితాపీఠం నుంచీ ఈ శోభాయాత్ర ఆరంభమైంది. రాముల వారి భారీ విగ్రహాన్ని వాహనంపై అధిష్టింపజేసి, పుష్పహారాలు, కాషాయ పతాకాలతో అలంకరింపజేసి శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు లలితా పీఠంలో లక్ష రామనామ జపం పారాయణం చేశారు. లలితాపీఠం పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం. మోక్షేశ్వరుడు, అఽధ్యక్షుడు కె. క్రిష్టన్న, ఉపాధ్యక్షులు ఎస్‌జీ మహాబలేష్, చల్లా దామోదర్‌రెడ్డి, నాగోజీరావు, నాయకులు నటేష్, ఎస్వీ నారాయణరెడ్డి, అచ్చి నరసింగరావు, లక్ష్మయ్య, రామచంద్రశ్యామ్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. యాత్రలో వివిధ ధార్మిక సంస్థలు, ఆలయాల కమిటీల నిర్వాహకులు, మహిళా భక్తులు సంప్రదాయంగా కాషాయ కండువాలతో ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లల కోలాట నృత్యాలు, భజనలు ఆకట్టుకున్నాయి. కాషాయ పతాకాలు ధరించిన యువత శోభాయాత్రలో సందడి చేశారు. పాతనగరంలోని వన్‌టౌన్, పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, కొండారెడ్డి బురుజు, రాజ్‌విహార్ మీదుగా రాజ్‌విహార్ బస్టాప్ పక్కన గల రేణుకా ఎల్లమ్మ ఆలయం జై శ్రీరామ్ అనే నినాదాలతో శోభాయాత్ర కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.