సాంకేతికతతో సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:21 PM
మారుతున్న కాలానికనుగుణంగా ఆధునాతన సాంకేతికతను వినియోగించుకొని, కష్టతరమైన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, కలెక్టర్ పి. రంజిత్‌బాషా అన్నారు.

మంత్రి టీజీ భరత్, కలెక్టర్ పి. రంజిత్‌బాషా
రూ.2812. కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ
స్కాడ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ప్రారంభం
ట్రిపుల్ ఐటీకు తాగునీరు అందించే పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలానికనుగుణంగా ఆధునాతన సాంకేతికతను వినియోగించుకొని, కష్టతరమైన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, కలెక్టర్ పి. రంజిత్‌బాషా అన్నారు. సోమవారం రూ.28.12 కోట్లకు సంబంధించి కీలకమైన అభివృద్ధి పనులకు మంత్రి, కలెక్టర్‌తో పాటు మేయర్ బీవై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కమిషనర్ ఎస్. రవీంద్రబాబు భూమిపూజ చేశారు. అశోక్‌నగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద రూ.4.62 కోట్లతో నీటి వ్యవస్థ నిర్వహణకు సంబంధించి పర్యవేక్షక వ్యవస్థ, సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడ)ను, రూ.1.15 కోట్లతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 3 శుభ్రత పనుల యంత్రాల వాహనాలు, 2 చెత్త సేకరణ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించారు. అదే విధంగా రూ.22.00 కోట్లతో జగన్నాథ గట్టుమీద నూతనంగా ఏర్పడిన ట్రిపుట్ ఐటీ కాలేజీకి తాగునీరు సరఫరాకు సంబంధించి వీకర్ సెక్షన్ కాలనీ పుచ్చలపల్లి సుందరయ్య పార్కులో 12 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్, సంపు, పంపింగ్ స్టేషన్‌కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ఎనిమితి నెలలుగా నగరంలో దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కల్లూరు ప్రాంతంలో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంలో నామమాత్రపు జీవో జారీ చేశారని, బడ్జెట్ లేకుండా టెండర్ పిలిచారని విమర్శించారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకొని ఆర్థిక ఇబ్బందులో సైతం రూ.22 కోట్లు మంజూరు చేశారని అందుకు ఎమ్మెల్యేకు, సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. స్కాడ వ్యవస్థ గురించి గత ప్రభుత్వం ప్రచార అర్భాటంతో సరిపెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దీనికి తాత్కాలిక వ్యవస్థ ఏర్పాటు చేసిందని అన్నారు. నీరు ఎక్కడెక్కడికి ఎంత వెళ్తున్నదీ, ఔట్ ఫ్లో, ఇన్‌ఫ్లో, పైపు లీకేజీ వంటి వివరాలను స్కాడ నిరంతర పర్యవేక్షణ వల్ల వెంటనే తెలుసుకోవచ్చని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో దీర్ఘకాలికంగా ఉన్న తాగుఉనీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తుందన్నారు. మేయర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, స్కాడ వ్యవస్థ వినియోగం వల్ల శ్రమ లేకుండా, నీరు వృథా కాకుండా సులువుగా సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీ డీఎం యూనివర్సిటీకి తాగునీటి సౌకర్యం కోసం రూ.22 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభమయ్యాయని అన్నారు. తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ వీకర్‌సెక్షన్ కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య పార్కులో 12 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్ నిర్మాణం వల్ల వాటర్‌ను శుద్ధి చేసి ట్రిపుల్ ఐటీ డీఎంకు 5 ఎంఎల్‌డి, మిగిలిన 7 ఎంఎల్‌డి నీటిని కల్లూరు ప్రాంతంలో పెద్దపాడు, ఎల్. పేట, వీకర్ సెక్షన్ కాలనీ, ముజఫర్‌నగర్, అబ్బాస్‌నగర్, క్రిష్ణానగర్ తదితర కాలనీల్లో సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్లు కురువ పరమేష్, రాజేశ్వరరెడ్డి, ఎస్‌ఈ రాజశేఖర్, ప్రజారోగ్య అధికారి కే. విశ్వేశ్వరరెడ్డి, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, డీఈఈలు గిరిరాజు, మనోహర్‌రెడ్డి, గంగాధర్, ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.