Share News

సీజనల్‌ దోపిడీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:02 AM

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశారు.

సీజనల్‌ దోపిడీ
తుగ్గలి మండలం జొన్నగిరిలో ఇలా కానిస్తున్నారు

జిల్లాలో విద్యార్థుల వలస నివారణకు 35 హాస్టళ్లు ఏర్పాటు

ఒక్కో కేంద్రంలో 50 మందికి అవకాశం

అధిక హాస్టళ్లల్లో అరకొర విద్యార్థులు

బోగస్‌ హాజరు చూపి నిధులు నొక్కేస్తున్న సిబ్బంది

ఆంధ్రజ్యోతి విజిట్‌లో విషయాలు బహిర్గతం

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. రికార్డు ప్రకారం 105 మంది విద్యార్థులు భోజనం చేయాలి. ఆదివారం కేవలం 15 మంది విద్యార్థులే ఉన్నారు. వారికైనా మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించారా..? అంటే అదీలేదు. నీళ్ల చారు, ముద్దన్నంతో సరిపుచ్చారు. కేర్‌టేకర్‌, ట్యూటర్లు అందుబాటులో లేవు. పెద్దహరివాణంలో ఒక్కటే కాదు.. జిల్లాలో ముప్పాతిక శాతం సీజనల్‌ హాస్టళ్ల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. కరువు కోరల్లో చిక్కుకొని.. బతుకుపోరులో రైతులు, కూలీలు ఊరుగాని ఊళ్లకు వలస వెళితే.. వారి పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదని, ఆ చిన్నారులకు ఆకలి తీర్చాలనే లక్ష్యంగా ప్రభుత్వం కాలానుగుణ వసతి కేంద్రాలు (సీజనల్‌ హాస్టళ్లు) ఏర్పాటు చేసింది. అయితే ఇవి కొందరు స్వార్థపరుల దోపిడీ కేంద్రాలుగా మారాయి. అమ్మనాన్నలు వలసలు వెళితే.. ఆకలికేకలతో అలమటించే చిన్నారులకు ఆకలి తీర్చే సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా..? అంటూ పలువురు మండిపడుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ బృందాలు ఆయా సీజనల్‌ హాస్టళ్లను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించగా దారుణమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా..

కర్నూలు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా అంటే కరువు.. వలసలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 2.50 లక్షల కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ప్రాంతాల్లో పత్తి తీత, మిరప కోత పనులకు వలసలు వెళ్లాయి. కన్నవాళ్లతో పాటు చదుకునే విద్యార్థులు కూడా వలస వెళ్తుండడంతో బడిలో హాజరు శాతం తగ్గుతోంది. బడిలో డ్రాపౌట్స్‌ సంఖ్య పెరుగుతోంది. అమ్మనాన్నలు వలస వెళ్లినా.. పేద విద్యార్థులకు రోజూ మూడు పూటల ఆకలి తీర్చి బడిలో హాజరు శాతం పెంచాలనే లక్ష్యంగా జిల్లాలో 35 సీజనల్‌ హాస్టళ్లుఏర్పాటు చేశారు. ప్రతి హాస్టల్‌లో 50 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలలో తింటే.. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం ఈ హాస్టళ్లలో వడ్డించాలి. ఆదివారం వంటి సెలవు రోజుల్లో మధ్యాహ్నం కూడా భోజనం వడ్డించాలి. అమ్మనాన్నలు వలస వెల్లడంతో ఆలనపాలన బాధ్యతలు ఈ వసతి కేంద్ర నిర్వాహకులే చూడాలి. అందుకుగానూ ప్రభుత్వం ఒక్కొ విద్యార్థికి రూ.1,000, కేర్‌ టేకర్‌, ట్యూటర్‌, ఇద్దరు వంట మనుషులు రూ.30 వేలు జీతం చొప్పున ఒక్కొ సీజనల్‌ హాస్టల్‌కు రూ.80 వేలు నిధులు ఇస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 35 సీజనల్‌ హాస్టళ్లకు నెలకు రూ.28 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈ నిధులు సమగ్రశిక్ష అభియాన్‌ ద్వారా కేటాయిస్తున్నారు.

అధ్వానం.. అరకొర భోజనం

అమ్మనాన్నలు వలస వెళ్లడంతో ఆకలికేకలతో అలమటిస్తున్న పేద విద్యార్థులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే సీజనల్‌ హాస్టళ్లను నిబంధనలు ప్రకారం నిర్వహిస్తున్నారా..? మెనూ ప్రకారం భోజనాలు వడ్డిస్తున్నారా..? విద్యార్థుల సేవలో ఏమేరకు తరిస్తున్నా యి..? తెలుసుకునేందుకు ఆదివారం పలు సీజనల్‌ హాస్టళ్లను ‘ఆంధ్రజ్యోతి’ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేస్తే అత్యంత దారుణమైన నిజాలు వెలుగు చూశాయి. మెజార్టీ హాస్టళ్లలో సగం కంటే తక్కువ విద్యార్థులే ఉన్నారు. వారికైనా రుచికరమైన భోజనం వడ్డించారా..? అంటే అదీలేదు. నీళ్ల చారు, ఉడికీ ఉడకని ముద్దన్నంతో సరిపుచ్చారు. కేర్‌ టేకర్‌, ట్యూటర్లు అందుబాటులో లేరు. 50 మంది విద్యార్థులకు రెండు మూడు కిలోల అన్నం వంట చేశారు. పలు హాస్టళ్లలో రికార్డులు లేవు. సోమవారం వరకు 90-95 శాతం వరకు హాజరైనట్లు హాజరు పట్టీలో చూపించారు. ఆదివారం హాజరే వేయలేదు. ఇదేమని అక్కడ ఉన్నవారిని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదంటూ సమాఽధానం ఇచ్చారు. కాసుల కక్కుర్తితో పేద విద్యార్థుల కడుపు కొడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సిన మండల విద్యా అధికారులు (ఎంఈవో) తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది.

అధికారుల తనిఖీలోనూ ఇదే పరిస్థితి

సమగ్రశిక్ష అధికారుల తనిఖీలో కూడా పెద్దఎత్తున నిర్లక్ష్యం, అక్రమాలు వెలుగు చూశాయి. ఈ నెల 18న సమగ్రశిక్ష అభియాన అడిషనల్‌ ప్రాజెక్టుకో-ఆర్డినేటర్‌ (ఏపీసీ) టి.శ్రీనివాసులు మండల కేంద్రం కోసిగి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు సీజనల్‌ హాస్టళ్లు తనిఖీ చేస్తే ఆ సమయంలో తాళం వేశారు. ఆ తరువాత కేర్‌ టేకర్‌ వచ్చి తలుపులు తీసినా అక్కడ హాస్టల్‌ నిర్వహిస్తున్న ఆనవాళ్లు లేవు. రికార్డులు కూడా లేవు. పాఠశాల నైట్‌ వాచ్‌మనే కేర్‌ టేకర్‌గా పని చేస్తున్నారు. 19న పత్తికొండ మండలం పదికోన సీజనల్‌ హాస్టళ్లు తనిఖీ చేయగా.. ఒక చిన్న గదిలో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 50 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేయడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. అంతేకాదు.. ఒక హాస్టల్‌లో విద్యార్థులు హాజరు కాలేదు. మరో హాస్టల్‌లో 15-20 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అధికారుల తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలు ఇవి. అంటే.. సీజనల్‌ హాస్టళ్ల నిర్వాహకులు పేద విద్యార్థుల ఆకలి పేరిట ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల ద్వారా సమగ్ర విచారణ చేయిస్తే సీజనల్‌ హాస్టళ్ల పేరిట జరుగుతున్న భారీ అక్రమాల భాగోతం వెలుగు చేసే అవకాశం లేకపోలేదు.

ఆంధ్రజ్యోతి బృందం పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాల

ఆదోని రూరల్‌: కర్ణాటక సరిహద్దున ఉన్న మండలంలోని పెద్దహరివాణం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో రెండు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్‌-1లో 53, హాస్టల్‌-2లో 52 మంది కలిపి 105 మంది విద్యార్థులు ఉన్నట్లు హాజరు పట్టికలో చూపించారు. రెండు హాస్టళ్ల పరిధిలో ఆదివారం బాలికలు 11 మంది. బాలురు 4 కలిపి 15 మంది విద్యార్థులు ఉన్నారు. కేర్‌ టేకర్లు, ట్యూటర్లు, వంట మనుషులు అందుబాటులో లేరు. కేవలం మూడు నాలుగు కిలోలు అన్నం, నీళ్లచారు వంట చేశారు. చికెన్‌ లేదా గుడ్డు చేయాల్సి ఉంటే చేయలేదు. 12 గంటల తరువాత హెల్పర్‌ ఒకరు వచ్చారు. రోజే ఇదే పరిస్థితి అని స్థానికులు తెలిపారు.

కౌతాళం: మండలంలోని కాత్రికి గ్రామంలో సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేశారు. 50 మంది విద్యార్థులకు గానూ ఏడుగురే ఉన్నారు. కేర్‌ టేకర్‌, ట్యూటర్‌, వంట మనుషులు లేవు. వాచ్‌మన్‌ ఒక్కరే ఉన్నారు. ఒకటి రెండు కిలోలు స్వీట్‌ పొంగల్‌ (బెల్లం అన్నం) చేశారు. రికార్డులు లేవు. రోజూ ఇదే పరిస్థితి అని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ‘మా సారు కర్నూలు నుంచి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు’ అని విద్యార్థులు తెలిపారు. కౌతాళంలోని సీజనల్‌ హాస్టళ్ల పరిస్థితి దాదాపు ఇదే.

కోసిగి: మండలంలోని కుందుకూరు గ్రామంలో ఓ ఇంట్లో సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేశారు. 50 మంది విద్యార్థులకు గానూ ఒక్కరు కూడా హాజరు కాలేదు. కేర్‌ టేకర్‌, వంట మనిషి ఇద్దరు శ్రీశైలం వెళ్లడంతో రెండు మూడు రోజులుగా హాస్టల్‌ మూత పడిందని స్థానికులు తెలిపారు. తెరిచిన రోజుల్లో కూడా 15-20 మందికి విద్యార్థులకు మించి రావడం లేదని అంటున్నారు.

కోడుమూరు: మండలంలోని కల్లపరి గ్రామంలో సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేశారు. స్థానిక స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఈ హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వండిన అన్నంను పరిశీలిస్తే రెండు కిలోలకు మించి ఉండదని తెలుస్తుంది. నీళ్ల చారుతో సరిపుచ్చారు.

తుగ్గలి మండలం జొన్నగిరి, మండల కేంద్రం హోళగుంద, హాలహర్వి మండలం నెట్రవట్టి గ్రామాల్లోని సీజనల్‌ హాస్టళ్లలో తనిఖీ సమయంలో నిబంధనల మేరకు విద్యార్థులు హాజరైనా పలు కేంద్రాల్లో మెనూ ప్రకారం భోజనాలు వడ్డించలేదని తెలుస్తోంది.

కేసులు నమోదు చేస్తాం

జిల్లాలో 35 సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. అమ్మనాన్నలు వలస వెళ్లారనే బాధలేకుండా ఒక్కొ హాస్టల్‌లో 50 మంది విద్యార్థులకు భోజనాలు వడ్డించడమే కాకుండా చదువు చెప్పిస్తున్నాం. వీటి నిర్వహణపై మండల విద్యా అధికారులు వారంలో రెండు హాస్టళ్లు ఆకస్మిక తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. నిబంధనలు ప్రకారం నిర్వహణ లేకపోతే కలెక్టరుకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం. అసరమైతే కేసులు నమోదు చేస్తాం.

- పాల్‌, డీఈవో, కర్నూలు

ఎంఈవోలు తనిఖీ చేయాలి

సీజనల్‌ హాస్టళ్లను ఎంఈవోలు క్రమం తప్పక తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇటీవల కోగిసి, పత్తికొండ మండలం పందికోన గ్రామంలోని నాలుగు సీజనల్‌ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశాను. రెండు మూడు కేంద్రాల్లో విద్యార్థులే లేరు. ఓ కేంద్రంలో 15-20 మందే ఉన్నారు. రికార్డులు కూడా అందుబాటులో లేవు. కేర్‌ టేకర్లు, ట్యూటర్లు కూడా లేరని గుర్తించాం. ఆయా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. కలెక్టరుకు నివేదిక పంపించి ఆయన ఆదేశాల మేరకు శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.

- టి.శ్రీనివాసులు, ఏపీసీ, సమగ్రశిక్ష అభియాన్‌, కర్నూలు

Updated Date - Feb 24 , 2025 | 12:02 AM