Share News

అటవీ భూముల్లో ఇసుక దొంగలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:12 AM

గతంలో వాగులు, వంకలలో ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసేవారు. తాజాగా ఇసుక మాఫియా పచ్చని అడవి భూములపై కన్నేసింది. రాత్రి వేళల్లో అటవీ భూముల్లోకి ట్రాక్టర్లతో ప్రవేశించి ఇసుకను తరలించుకపోయి సొమ్ము చేసుకుంటున్నారు.

అటవీ భూముల్లో ఇసుక దొంగలు
విజయవనం అటవీ భూమి నుంచి ట్రాక్టర్లతో ఇసుక తరలింపు

39 ఎకరాల్లో ఇసుక మేటలు..

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

కర్నూలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): గతంలో వాగులు, వంకలలో ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసేవారు. తాజాగా ఇసుక మాఫియా పచ్చని అడవి భూములపై కన్నేసింది. రాత్రి వేళల్లో అటవీ భూముల్లోకి ట్రాక్టర్లతో ప్రవేశించి ఇసుకను తరలించుకపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్ద రు ఫారెస్ట్‌ అధికారుల అండతోనే ఈ భాగోతం జరుగుతున్నదని, మామూళ్లు అందుతుండడంతో కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగర శివారులో హంద్రీ నది ఒడ్డునే ఉన్న ‘విజయ వనం’ అటవీ భూముల్లో ఇసుకాసురులు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు అటవీ భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని, ఆరోపణులు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కర్నూలు నగర శివారున హైదరాబాద్‌-బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని దిన్నెదేవరపాడు రెవెన్యూ గ్రామం పరిధిలో ‘విజయ వనం’ ఉంది. 97 ఎకరాలు అటవీ శాఖ భూములు ఉన్నాయి. హంద్రీ నది ఒడ్డు నుంచి సుమారు 38 ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నాయి. అక్రమార్కులకు ఇసుక కాసుల వర్షం కురిపిస్తున్నది. రాజకీయ అండతో కొందరు అక్రమార్కులు అటవీ భూముల్లో వాలిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకొని పదుల ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. రోజుకు దాదాపుగా 35-40 ట్రాక్టర్లు ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తున్నది. ఒకనాడు బీచ్‌గా అందంగా కనిపించిన ఈ అటవీ భూముల్లో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు పడ్డాయి. అటవీ శాఖ చట్టాలు బలంగా ఉన్నా.. అక్రమార్కు లు ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు అడ్డుకట్ట వేయలేపోవడం వెనుక అంతర్యామేమిటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.

దర్జాగా ఇసుక రవాణా

జిల్లా కేంద్రంలో అటవి శాఖ చీఫ్‌ కన్‌జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌), జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ), ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఓ), డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌.. ఇలా వివిధ హోదాల్లో అధికారులు పని చేస్తున్నారు. అటవీ భూముల సంరక్షణ, అక్రమ తవ్వకాలు, చెట్లు నరికేయడం, ఆక్రమణలు వంటివి అరికట్టేందుకు ఫారెస్ట్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ ప్రత్యేక టీం కూడా ఉంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా కూడా జిల్లా కేంద్రం పక్కనే అటవీ భూముల్లో అక్రమార్కులు చొరబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాదారులకు ఈ శాఖలోని ఒకరిద్దరు అధికారులు తెరవెనుక సహకరి స్తున్నందు వల్లే ఈ అవినీతి సాగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పైఅధికారులు ఎవరైనా వస్తున్నారంటే విజయం వనంలో పని చేసే కాంట్రాక్ట్‌ సిబ్బంది తక్షణమే ఇసుక ట్రాక్టర్ల యజమానులకు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణులు ఉన్నాయి.

అటవీ భూమి సంరక్షణకు చర్యలు

విజయవనం అటవీ భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లా అటవీ శాఖ అధికారి(డీఎఫ్‌ఓ) శ్యామల వివరణ కోసం ఆంధ్రజ్యోతి ఫోన్లో ప్రయత్నించింది. అయితే ఆమె అందుబాటులోకి రాలేదు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి విజయకుమార్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా ఆరు నెలల క్రితమే ఇక్కడికి బదిలీపై వచ్చానని, అటవీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయిస్తా అన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:12 AM