Share News

పొలంలో బోల్తాపడ్డ బస్సు

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:25 AM

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. మండలంలోని కల్వటాల సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడి 16మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 పొలంలో బోల్తాపడ్డ బస్సు

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ ..

16మందికి గాయాలు .. నలుగురికి తీవ్ర అస్వస్థత ..

పొలంలో పడటంతో తప్పిన ప్రాణ నష్టం ..

మెరుగైన చికిత్స అందించాలని మంత్రి బీసీ సూచన

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు బోల్తా ..

కొలిమిగుండ్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. మండలంలోని కల్వటాల సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడి 16మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె(హైర్‌) బస్సు (ఎపి 39 యూవీ 4299) జమ్మలమడుగు నుండి తాడిపత్రికి 34మంది ప్రయాణికులతో బయల్దేరింది. డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల కల్వటాల సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే 10అడుగుల లోతు ఉన్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చెయొద్దని ప్రయాణికులు చెబుతున్నా వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలీలు, వాహనచోదకులు సహాయక చర్యలు చేపట్టారు. నందిపాడుకు చెందిన సుబ్బలక్షమ్మ, రామలక్షమ్మ, డ్రైవర్‌ ఎస్‌.మహాబూబ్‌ బాషా, నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. కల్వటాలకు చెందిన మూగెన్న, కండక్టర్‌ జీవన్‌కుమార్‌, రాగిణి, లక్ష్మి, ఆదెమ్మ, కడప జిల్లాకు చెందిన మరికొంత మంది ప్రయాణికులు గాయపడ్డారు. సీఐ రమేశ్‌బాబు తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అవుకు, బనగానపల్లె క్లస్టర్‌ ఆసుపత్రులకు తరలించారు. సుబ్బలక్ష్మమ్మతో పాటు మరో మహిళకు తీవ్ర గాయాల కారణంగా కర్నూలుకు తరలించినట్లు స్థానిక వైద్య సిబ్బంది వెల్లడించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా పడిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

బస్సు బోల్తా ఘటనపై మంత్రి బీసీ ఆరా

బనగానపల్లె, మార్చి4(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ ఘటనపై రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఆరా తీశారు. గాయపడ్డ 20మంది ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి బీసీ వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు సరైన చికిత్సలు నిర్వహించాలని అవుకు, బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

Updated Date - Mar 05 , 2025 | 12:25 AM