రోడ్డు టెర్రర్..!
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:39 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

నెత్తురోడుతున్న రహదారులు
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
పట్టించుకోని రవాణ, పోలీసు శాఖలు
తూతూ మంత్రంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక రోడ్డులో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రహదారి ప్రమాదాలను నివారించడంలో అటు రవాణా, ఇటు పోలీసు శాఖల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ఆర్టీసీ, ఆటో, లారీ, ఇతర వాహనడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం వల్లే ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించి ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికలు సమర్పిస్తున్నా ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అథారిటీ, మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కోడుమూరు రహదారిలో జరిగిన ఓ ఘటనలో ఒకరు, మరో ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదల్లో వారి స్పీడును పరిశీలిస్తే 140 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు తెలిసింది. అలాగే రోడ్డుపై సరైన అవగాహన లేక ఓవర్‌టెక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే ప్రతి ప్రమాదం కూడా డ్రైవర్ నిర్లక్ష్యమని అధికారుల విశ్లేషణలు చెబుతున్నాయి. నిద్రమత్తు, మద్యం సేవించి వాహనాలు నడపటం, దీంతో పాటు సురక్షిత ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మానవ తప్పిదాల వలన 95 శాతం ప్రమాదాలు జరుగుతుంటే అందులో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం, మరో 25 శాతం రోడ్లు, వాహనాల మరమ్మతుల కారణంగా జరుగుతున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షా 50 వేల మంది మృత్యువాత పడుతుంటే నాలుగు లక్షలకు పైగానే క్షతగాత్రులుగా మారుతున్నారు. మన రాష్ట్రంలో సుమారు ఏటా 12 వేల మంది మృతి చెందుతున్నారు. అలాగే జిల్లాలో ఏటా 500 నుంచి 600 మంది వరకు మృతి చెందుతున్నట్లు, 3 వేల మందికిపైగా గాయాలపాలవుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
ప్రమాదంగా ఆటోలు, బైకుల ప్రయాణం
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు గమనిస్తే ఎక్కువ శాతం జిల్లాలో ఎక్కువగా ఆటోలు, బైకుల ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. లారీలు యమపాశాలుగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆటోలు, మోటారు సైకిళ్లపై కనిపిస్తుంటారు. ఒక మోటారు సైకిల్‌పై ముగ్గురు, ఆటోలో పది మంది దాకా ప్రయాణిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉల్చాల రోడ్డు వద్ద ఇద్దరు యువకులు బైక్‌పై ప్రయాణం చేస్తూ ఆటోను ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం. జనవరిలో జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే ఎక్కువ శాతం మోటారు సైకిల్ ప్రమాదాలే ఉన్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటికి 40 మంది దుర్మరణం
ఫిబ్రవరి 2వ తేదీన ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫిబ్రవరి 5న నాగులాపురం సమీపంలోని పెంచికలపాడు వద్ద బైక్‌పై వెళ్తున్న అవ్వ, మనుమడు వెనుక నుంచి వచ్చి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.
ఫిబ్రవరి 6న ఓర్వకల్లు సమీపంలో జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి చెందారు. రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
ఫిబ్రవరి 4వ తేదీన ఓర్వకల్లు సమీపంలో సోమయాజులపల్లె వద్ద బొలేరో వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అలాగే ఇదే రోజు కల్లూరు హంద్రీ వంతెనపై మోటారు సైకిల్‌పై వెళ్తున్న నాగశేషారెడ్డి అనే కానిస్టేబుల్‌ను బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఫిబ్రవరి 8న వెల్దుర్తి సమీపంలో కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడి మహిళ మృతి చెందింది.
దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో ట్రాక్టరు తిరగబడి జగదీష్ అనే వ్యక్తి మృతి చెందాడు.
జనవరి మంత్రాలయం మండలంలోని చౌలేహల్లి గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొని నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం 25న శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక పదవ తరగతి విద్యార్థిని అనూష (15) మృతి చెందింది. అలాగే చెట్నహల్లి గ్రామం నడుచుకుంటూ వెళ్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో చెన్నైకి చెందిన మహిళా భక్తురాలికి గాయాలయ్యాయి. అదే రోజు మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామం వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ ఏడాది జనవరి 23న ఒక్క రోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలులో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా ఉల్చాల రోడ్డులో ఓ మహిళ మృతి చెందింది. ఆస్పరి వద్ద ద్వీచక్రవాహనం లారీని ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు, పెద్దకడుబూరు సమీపంలో హనుమాపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో మరో యువకుడు దుర్మరణం చెందాడు.
జనవరి 22న మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, ఒక డ్రైవర్ కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అలాగే మంత్రాలయం సమీపంలో సూగూరు వద్ద ద్విచక్ర వాహనంలో చీర కొంగు ఇరుక్కొని కింద పడి మహిళ మృతి చెందింది.
జనవరి 18న హుశేనాపురం, ఓర్వకల్లు మధ్యలో ఓ కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు.
ఈ నెల 19న తుగ్గలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.
కర్నూలు నగరంలో ఈ నెల 13న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. స్పీడ్ బ్రేకరు ఎక్కించబోయి అదుపు తప్పి కింద పడి వంశీకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు.
జనవరి 17న కోడుమూరు సమీపంలో కారు బస్సును ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఐచర్ వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కోడుమూరు వెళ్లే రహదారిలో ఆందోళన కలిగించింది.
జనవరి 15న వెల్దుర్తి సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొన్న సంఘటనలో చిన్నారి బాలుడు దుర్మరణం చెందాడు.
గోనెగండ్ల సమీపంలో కారు అదుపు తప్పడంతో కారులో ఉన్న పది మందికి గాయాలయ్యాయి.
ఈ నెల 6వ తేదీన కోడుమూరు రోడ్డులో కొత్తూరు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడటంతో జయన్న అనే వ్యక్తి మృతి చెందాడు.
జనవరి 2వ తేదీన కోడుమూరు రహదారిలో కొత్తూరు కారు, బైక్ డీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు రామగోవిందు, వరలక్ష్మి దంపతులు దుర్మరణం చెందారు.
డిసెంబరు 21వ తేదీన మద్దికెర సమీపంలో ఓ ఉపాధ్యాయుడు ద్వీచక్రవాహనం పై నుంచి కింద పడి. జనవరిలో 19న కోలుకోలేక మృతి చెందాడు.
హెల్మెట్ వాడకపోవడంతోనే
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం బైక్ ప్రమాదాలే ఉన్నాయి. వీరంతా హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రమాదాల్లో మృతి చెందారు. కేవలం సెల్‌ఫోన్‌కు రూ.300లు వెచ్చించి పౌచ్, రక్షణకవచం, ప్రొటెక్షన్ గ్లాస్ వాడుతుంటారు. మన శరీరంలో ముఖ్యమైన శిరస్సుకు రూ.500లు విలువ గల హెల్మెట్ కొని ప్రయాణించడంపై నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 6 లక్షల ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. సుమారు వెయ్యి మంది మాత్రమే హెల్మెట్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.
కోడుమూరు రహదారిలోనే..
కర్నూలు కోడుమూరు, దేవనకొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు రహదారిలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గాల్లో సరైన రోడ్డు సూచిక బోర్డులు లేకపోవడం, డివైడర్లు లేకపోవడం, గ్రామాలకు చెందిన వారు బైకులపై వెళ్తుండటం, పోలీసుల తనిఖీలు లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కర్నూలు నుంచి కోడుమూరు వరకు వేగవంతమైన ప్రయాణంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు లెక్కలో చెబుతున్నాయి. గతంలో ఎస్పీలు అప్పుడప్పుడు రహదారి ప్రమాదాల పట్ల విస్తృత అవగాహన కల్పించినా రాను రానూ కింది స్థాయి పోలీసు అధికారులు ప్రమాదాలు నివారించడంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది.
సరైన నైపుణ్యం లేకపోవడం వల్లే..
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ఎక్కువ మంది సరైన నైపుణ్యం, అవగాహన లేకపోవడం వల్లేనని తెలుస్తోంది. కోడుమూరు రహదారిలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నది వాస్తవమే. ఇంజనీరింగ్ అధికారులను కూడా సంప్రదించాం. వారు రోడ్ల సమస్య ఏమీ లేదని చెబుతున్నారు. మరో పక్క గమనిస్తే అతివేగమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
- తబ్రేజ్, సీఐ, కోడుమూరు
హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలు
బైక్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది మృతి చెందడానికి కారణం హెల్మెట్ లేకపోవడమే. హెల్మెట్ ధరించాలని ద్విచక్రవాహనదారులకు పదేపదే అవగాహనకల్పిస్తున్నాం. వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. రోడ్డు ప్రమాదలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- మన్సూరుద్దీన్, కర్నూలు ట్రాఫిక్ సీఐ