Share News

రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలి: ఎస్పీ

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:47 PM

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా పిలుపునిచ్చారు.

 రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలి: ఎస్పీ
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఏఎస్పీ ఎన్‌.యుగంధర్‌బాబు

నంద్యాల క్రైం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రవాణాశాఖ ఈ నెల 16నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను చాలా మంది పాటించడంలేదన్నారు. ద్విచక్రవాహనం నడిపేటపుడు హెల్మెట్‌, కారు నడిపేటపుడు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌.యుగంధర్‌బాబు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు జి.శ్రీకాంత్‌, జిటినాయుడు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రయాణ సమయంలో చేసే చిన్న పొరపాటు వల్ల మీతోపాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల తాము విజిబుల్‌ పోలీసింగ్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:47 PM