Share News

నేటి నుంచి భూ విలువల సవరణ

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:31 AM

జిల్లాలో భూముల విలువలను సవరించనున్నారు. అర్బన్‌, గ్రామ కమిటీల సూచనల ఆధారంగా, ఇతర అంశాల ప్రాతిపాదికన వ్యవసాయేతర, వ్యవసాయ భూములను మూడు భాగాలుగా విభజించి ధరలు నిర్ణయించారు

నేటి నుంచి భూ విలువల సవరణ
జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ కార్యాలయం

10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగే అవకాశం

ధరలు పెరగనున్న నేపఽథ్యంలో క్రయ విక్రయదారుల రద్దీ

కిటకిటలాడుతున్న కల్లూరు, కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు

జిల్లాలో భూముల విలువలను సవరించనున్నారు. అర్బన్‌, గ్రామ కమిటీల సూచనల ఆధారంగా, ఇతర అంశాల ప్రాతిపాదికన వ్యవసాయేతర, వ్యవసాయ భూములను మూడు భాగాలుగా విభజించి ధరలు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఽభూముల ధరలు అన్నిచోట్లా 10 నుంచి 15 శాతం పెంచాలని చూస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకొని అనంతరం సవరించిన రిజిస్ర్టేషన్‌ ధరలను ఫిబ్రవరి 1వ తేది నుంచి అమలు చేయనున్నారు. మార్కెట్‌ విలువకు తగ్గట్టుగానే రిజిస్ర్టేషన్‌ చార్జీలు సవరించి వినియోగదారులపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించనుంది.

కల్లూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఆదాయార్జనే లక్ష్యంగా ఉన్న విలువకు రెండు, మూడంతల రేట్లు పెంచడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. ఉమ్మడి జిల్లాలో ఆస్తులు స్థలాల క్రయవిక్రయాలు మందగించడంతో ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి పడింది. రిజిస్ర్టేషన్‌ శాఖ లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్చుతగ్గులను సవరించి భూవిలువలను పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఈమేరకు ఫిబ్రవరి 1వ తేది నుండి ఈప్రక్రియ అమల్లోకి రానుంది.

చివరి రోజు కిటకిటలాడిన కార్యాలయాలు: ఫిబ్రవరి 1 నుండి భూ విలువల సవరణ నేపఽథ్యంలో చివరి రోజు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. భూముల విలువ సవరించడంతో రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో క్రయ విక్రయదారులతో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. శుక్రవారం కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి ప్రజలు తరలివచ్చారు. రద్దీ పెరగడంతో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిదానంగా సాగింది. మరోపక్క సర్వర్లు మొరాయించడంతో అధికారులు రాత్రి సమయంలోనూ పనిచేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం, బిల్డర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జ్‌ రిజిస్ర్టార్‌ చెన్నకేశవరెడ్డికి సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. నిర్మాణ రంగం సంక్షోభంలో ఉందని ఇలాంటి సరిస్థితుల్లో రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంచడం సరైంది కాదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి భవనాలు కొనేవారు లేక నిలిచిపోయాయని, టు లెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్‌ అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ బ్రిజేష్‌సింగ్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి, ఆర్‌వి. బ్రహ్మయ్య, కే. మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:31 AM