Share News

తగ్గిన నీటి ప్రవాహం

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:00 AM

తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి విడుదలయ్యే నీరు నాలుగు రోజులుగా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో దిగువ కాలువకు నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

తగ్గిన నీటి ప్రవాహం
గోనెగండ్ల సెక్షన్‌కు చేరిన 19 క్యూసెక్కుల నీరు

గోనెగండ్ల సెక్షన్‌కు 19 క్యూసెక్కులే రాక

పంటలు ఎండుతుండడంతో రైతుల ఆందోళన

గోనెగండ్ల, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి విడుదలయ్యే నీరు నాలుగు రోజులుగా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో దిగువ కాలువకు నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. బుధవారం గోనెగండ్ల సెక్షన్‌కు 19 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదలైంది. గుడికల్లు చెరువులో నీటి మట్టం పడిపోవడంతో కింద ఉన్న సెక్షన్‌లకు నీటి విడుదల నిలిచిపోయినంత పని జరిగింది. గోనెగండ్ల సెక్షన్‌కు రోజుకు 175 క్కూసెక్కులు విడుదల కావాల్సి ఉండగా గత సోమవారం 34 క్యూసెక్కులు, మంగళవారం 22 క్యూసెక్కులు బుధవారం 19 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో గోనెగండ్ల ఎల్లెల్సీ సెక్షన్‌ కింద సాగు చేసిన పంటలకు నీరందక ఎండుముఖం పట్టాయి. ఈ రబీ సీజన్‌లో గోనెగండ్ల సెక్షన్‌ కింద 7,900 ఎకరాలకుగాను దాదాపు 7,000 ఎకరాల వరకు సాగైంది. అయితే పంట చేతికి అందే సమయంలో నీటి విడుదల నిలిచి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కాలువకు చేరిన 19 క్యూసెక్కులను పీడీ కాలువకు మాత్రమే ఇరిగేషన్‌ అధికారులు మళ్లించారు. మిగతా కాలువలకు నీరు విడుదలను నిలిపివేశారు. గోనెగండ్ల సెక్షన్‌కు నీరు సక్రమంగా చేరక పోవడంతో దిగువ ఆయకట్టు అయిన కోడుమూరు సెక్షన్‌కు గత వారం రోజులుగా నీటి విడుదలను అధికారులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎల్లెల్సీ కింద వేరుశనగ, మిరప, మినుములు, మొక్కజొన్న, కందులు, తదితర పంటలను రైతులు సాగు చేసుకున్నారు. అయితే వేరుశనగ, కంది పంటలను మాత్రం రైతులు కోత కోసుకున్నారు. కాగా మిరప, మినుములు, మొక్క జొన్న పంటలు కోత దశలో ఉన్నాయి. వారికి చివరి తడి కట్టడం అవసరం అవుతుంది. కాలువలో నీరు లేకపోవడంతో పంటలు పొలంలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక ప్రాంతంలో రైతుల వరి కోతలు పూర్తి చేసుకొని మరో రకం పంటను సాగు చేసుకునేందుకు గాను నీటి వాడుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రకు వచ్చే నీటి మట్టం పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ రబీ సీజన్‌లో గోనెగండ్ల సెక్షన్‌కు 175 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంది. అయితే నాలుగైదు రోజులుగా సక్రమంగా నీరు విడుదల కాకపోవడంతో కాలువలో నీటి మట్టం పడిపోయింది. గోనెగండ్ల సెక్షన్‌ ఇరిగేషన్‌ అధికారులు కోడుమూరుకు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కోడుమూరు ఆయకట్టు రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. గోనెగండ్ల, అలువాల, తదితర తాగునీటి పథకాలకు కూడా నీటి విడుదల నిలిచిపోయింది.

Updated Date - Feb 13 , 2025 | 12:00 AM