వైభవంగా రామలింగేశ్వరుడి మహా రథోత్సవం
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:03 AM
వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రాంపురం రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

పాల్గొన్న అశేష భక్తజన వాహిని
ప్రత్యేక వాహనంపై రాంపురంరెడ్డి సోదరులు,
నాయకుల ఊరేగింపు
ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు
మంత్రాలయం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రాంపురం రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. బుధవారం మంత్రాలయం మండలంలోని రాంపురం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాంపురం రెడ్డి సోదరులు, ఆలయ ధర్మకర్తలు, మంత్రాల యం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు సీతారామిరెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మంచాల సొసైటీ మాజీ అధ్యక్షులు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, భీమా యూత నాయకులు ధరణీధర్ రెడ్డి, భీమారెడ్డి, మనోజ్‌రెడ్డి, నైరుద్‌రెడ్డి, ఆంధ్ర, కర్ణాటక మఠాలకు చెందిన పీఠాధిపతులను ప్రత్యేక వాహనంపై ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. రాంపురం రెడ్డి సోదరులు ఇంటి నుంచి ఉత్సవమూర్తి ఆలయం వరకు చేరుకుని అక్కడ పూజలు చేసి మహారథంపై ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తిని అర్చకులు తలపై పెట్టుకుని మోసుకువస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. మహారథం ముందుకు సాగుతుండగా.. నందికోల నృత్యాలు, కోలాటాలు, ప్రత్యేక నృత్యాల వేషాధారణలు, బొమ్మల ప్రదర్శ నలు మంగళవాయిధ్యాలు, బీరప్పడోళ్లు, తప్పెట్లతో మహారథానికి స్వాగ తం పలికారు. రథం ముందుకు సాగుతుండగా.. భక్తులు గోవిందా గోవిందా, హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు జయధ్వా నాలు పలికారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాంపురం రెడ్డి సోదరు లకు సన్మానాలు చేసేందుకు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, గుంతకల్లు, ఉరువకొండ, రాయచూరు, మాన్వి, సిందనూరు, ఐజ, గద్వాల, నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులు తరలివచ్చారు. ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రాలయం, కోసిగి, కౌతాళం సీఐ రామాంజులు, మంజునాథ్, అశోక్, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయకుమార్, పరమేష్ నాయక్ ఆధ్వర్యంలో 110 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గురెడ్డి భీమిరెడ్డి, బాబురెడ్డి, మురళీధర్ రెడ్డి, వ్యవసాయ మండలి మాజీ చైర్మన సీవీ విశ్వనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కృష్ణారెడ్డి, మంత్రాలయం తహసీల్దార్ ఎస్.రవి, సర్పంచ తెల్లబండ్ల భీమయ్య , ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు భక్తులు పాల్గొన్నారు.
అలరించిన నందికోల నృత్యాలు: రాంపురం జాతరలో సందర్భంగా బుధవారం రాత్రి కర్నూలుకు చెందిన ఎస్‌కే బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భీమవరానికి చెందిన కవిత, నృత్య కళాకారులు కర్ణాటక చెందిన గాయనీ లత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి, మిమిక్రీ, ఉర్రూతలూగించే జానపద నృత్యాలు భక్తులను అలరించాయి. అలాగే నందికోల, వీరభద్రుని వేషధారణలో భక్తుల నృత్యాలు, భీరప్పడ్రోళ్లు, ఆంజనేయుడు, పరమేశ్వరుని వేషాధారణలు, మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రాంపురం సోదరులకు, నాయకులకు స్వాగతం : శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవం సందర్బంగా రాంపురంరెడ్డి సోదరులకు జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీటీసీలు మజ్జిగ నరసమ్మ, జయలక్ష్మి, సర్పంచ మేకల సుజాత ఆధ్వర్యంలో భారీ గజమాల వేసి పూలవర్షం కురిపించారు. రోగెప్ప, బొజ్జప్ప, రవిరెడ్డి, వెంకోబ, జెట్టి వీరేష్ బృందం చేసిన గజమాల భక్తులను ఆకట్టుకుంది.