అశ్వ వాహనంపైఆది దంపతులు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:53 PM
శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.

పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ
ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపైౖ ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు జరిపారు. పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారులు, డప్పు వాయిద్యాలు, కళాకారుల శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
పుష్పోత్సవం, శయనోత్సవం
అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం ఘనంగా జరిపారు. వివిధ రకాల పువ్వులు, పత్రాలు ఇందులో సేవలో వినియోగించారు. అరటి, నిమ్మ, ద్రాక్ష, కమల, ఆపిల్, జామ, ఖర్జూరం మొదలైన 11 రకాల ఫలాలు నివేదించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఏకాంతసేవ జరిపి శయనోత్సవం చేశారు.