Share News

నందీశ్వర స్వామికి ఆర్జిత పరోక్ష సేవ

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:17 AM

శ్రీశైల క్షేత్రంలో గురువారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.

నందీశ్వర స్వామికి ఆర్జిత పరోక్ష సేవ
నందీశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

శ్రీశైలం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో గురువారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు. పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం నందీశ్వరస్వామికి శాస్ర్తోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతో, కుంకుమోదకం, హరిద్రోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికార్జున గుండంలోని శుద్ధజలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం జరిపారు. అభిషేకానంతరం నందీశ్వరస్వామికి నూతన వస్త్రసమర్పణ, విశేష అర్చనలు జరిపి, నానబెట్టిన శనగలను సమర్పించారు. తరువాత స్వామికి నివేదన సమర్పించారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది. భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఓఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుం చెల్లించి పాల్గొనవచ్చు. సేవాకర్తలే కాకుండా, భక్తులందరూ కూడా నందీశ్వరస్వామి ఆర్జిత పరోక్షసేవ పూజా కార్యక్రమాన్ని శ్రీశైల టీవీలో గానీ, యూట్యూబ్‌లో గానీ వీక్షించవచ్చు.

Updated Date - Apr 11 , 2025 | 01:17 AM