అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై భారం
ABN , Publish Date - May 30 , 2025 | 12:13 AM
దేశ ప్రధాని మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై ధరల భారం పడుతోందని సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు ఆరోపించారు.
నంద్యాల రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాని మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ అవకాశవాద రాజకీయాలతో ప్రజలపై ధరల భారం పడుతోందని సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధు ఆరోపించారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ పాక్, భారత్ మధ్య యుద్ధం ఆగడానికి ప్రధాని మోదీ చేసుకున్న ఒప్పందమేంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న మోదీ ఎంత మందిని అంతం చేసారో చెప్పాలని ప్రశ్నించారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ట్రంప్ జోక్యంతో ఆగిందన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలని మోడీని సూటీగా ప్రశ్నించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపేలా జగన్ చేసుకున్న సెకీ ఒప్పందం తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పయనిస్తున్నారని విమర్శించారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికే మహానాడును చంద్రబాబు ఓ వేదికగా వాడుకుంటున్నారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం చేసిన మోదీని చంద్రబాబు, జగన్ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు పుల్లా నరసింహ తదితరులు పాల్గొన్నారు.