ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:44 PM
ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వీవర్స్ కాలనీ మైదానంలో గురువారం అంతర్రాష్ట్ర ఒంగోలు ఎద్దుల బండలాగుడు బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
పాలపళ్ల సైజు విభాగంలో..
ఎమ్మిగనూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో వీవర్స్ కాలనీ మైదానంలో గురువారం అంతర్రాష్ట్ర ఒంగోలు ఎద్దుల బండలాగుడు బలప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ జాతర సందర్భంగా రైతు సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహి స్తున్నామన్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధిని పద్మశ్రీ మాచాని సోమప్ప తరువాత తన తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అదే తరహాలో తాను సీఎం చంద్రబాబు ఆశీస్సులతో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం గురురాఘవేంద్ర ప్రాజెక్టులో యంత్రాలను ఎత్తుకెళ్లినా అడిగే నాథుడే లేక పోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీఆర్పీకి మరమ్మతు చేసి సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఎద్దుల పోటీలే కాక యువకులకు ఫుట్ బాల్, కబడ్డీ, వాలీబాల్, బ్యాట్మిటన్, క్రికెట్ పోటీలను సైతం నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్, రామదాసు గౌడ్, ఈరన్న గౌడ్, విరూపాక్షి రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహేంద్ర బాబు, సోమేశ్వర రెడ్డి, కాశీం వలి, మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు 19 జతల ఎద్దులు: అంతర్రాష్ట్ర ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన పోటీల్లో కర్నూలు, నంద్యాల, తెలంగాణలోని గద్వాల ప్రాంతాల నుంచి 19 జతల 4 పాలపళ్ల సైజు ఎద్దులు పాల్గొన్నాయి. ఇందులో నందికొట్కూరు తాలుకా అలగనూరుకు చెందిన రోలిమేడమ్ ఎద్దులు నిర్ణీత సమయంలో 5415.5 అడుగుల దూరం బండలాగి మొదటి బహుమతి రూ. 35 వేలు కైవసం చేసుకున్నాయి. అలాగే నందికొట్కూరు నియోజకవర్గం కొణిదేల గ్రామానికి చెందిన దండు రైడర్స్ దండు శకుంతలమ్మ ఎద్దులు 5388.2 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి రూ. 25వేలు సొంతం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నాగేంద్ర, కడప జల్లా దువ్వూరు మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన దేవరాజు నాయుడు వృషభాలు 5152 అడుగుల దూరాన్నిలాగి మూడో బహుమతి రూ. 15వేలు గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూడు తాలుకా లద్దగిరి గ్రామానికి చెందిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఎద్దులు 4978.8 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి రూ. 10వేలు గెలుచుకోగా, తెలంగాణలోని గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన వడ్డెమాను అంజిరెడ్డి ఎద్దులు 4941.5 అడుగుల దూరం లాగి ఐదో బహుమతి రూ. 5వేలు గెలుచుకున్నాయి.
భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు : ఎద్దుల బలప్రదర్శన పోటీలను తిలకించేందుకు ఎమ్మిగనూరు పట్టణం నుంచే కాక చుట్టు ముట్టు గ్రామాలనుంచి ప్రజలు, రైతులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో పోటీలు జరిగే వీవర్స్ కాలనీ మైదానం జనంతో కళకళలాడింది.