కంది ధర పతనం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:27 AM
కర్నూలు మార్కెట్ యార్డులో కందులకు గత సంవత్సరం క్వింటానికి రూ.10 వేలకు పైగానే లభించింది.
ఆందోళనలో రైతులు
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో కందులకు గత సంవత్సరం క్వింటానికి రూ.10 వేలకు పైగానే లభించింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దాకా లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు ధర తగ్గిస్తూ వస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. బుధవారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటం కందులకు గరిష్ఠ ధర రూ.7,516, మధ్యస్థ ధర రూ.7,249లు, కనిష్ఠ ధర రూ.2,311కు చేరింది. ధర లభిస్తుందనే ఆశతో ఏకంగా 4,881 క్వింటాళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కందులకు రూ.7,550. కనీసం మద్దతు ధరకైనా కందులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.6,589, మధ్యస్థ ధర రూ.4,900, కనిష్ఠ ధర రూ.4,300 దక్కింది. పూల విత్తనాలపై గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధరలు ఒకే రీతిలో రూ.3,429 పలికాయి. ఆముదాలకు గరిష్ఠ ధర రూ.5,589, మధ్యస్థ ధర రూ.5,489, కనిష్ఠ ధర రూ.5,191 దక్కింది. మొక్కజొన్నలకు గరిష్ఠ ధర రూ.2,335, మధ్యస్థ ధర, కనిష్ఠ ధర రూ,2,311 అందింది. శనగలకు గరిష్ఠ ధర, మధ్యస్థ ధర రూ.6,256, కనిష్ఠ ధర రూ.2,010 అందింది. ఉల్లిగడ్డలకు గరిష్ఠ ధర రూ.2,769, మధ్యస్థ ధర రూ.2250, కనిష్ఠ ధర రూ.1589లు పలికింది. ఎండుమిరప కాయలకు గరిష్ఠం రూ.14,309లు, మధ్యస్థం రూ.9,999లు, కనిష్ఠ ధర రూ.1,019లు అందింది. కొర్రలకు గరిష్ఠ, మధ్యస్థ ధరలు క్వింటానికి రూ,3,351లు మాత్రమే పలికింది.