Share News

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:56 PM

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు
వాల్మీకి నగర్‌లో విచారిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి

కోసిగి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, వైద్యులు ఇబ్రహీం, రాజ్‌కిరిటీ, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో వాల్మీకి నగర్‌లో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను సక్రమంగా నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూపర్‌వైజర్‌, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా వర్కర్లను హెచ్చరించారు. డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సిబ్బంది వాల్మీకినగర్‌లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీలు శుభ్రం చేయించి తడి, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులు ట్రాక్టర్లతో తరలించారు. రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో వాల్మీకి నగర్‌లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి శుభ్రం చేశారు. అనంతరం రాత్రి దోమల నివారణ కోసం పంచాయతీ సిబ్బంది వాల్మీకి నగర్‌లో ఫాగింగ్‌ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి మాట్లాడుతూ వాల్మీకి నగర్‌ కాలనీవాసులకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించాలని, సబ్‌ సెంటర్‌లలో కాకుండా కాలనీలలో ఇంటింటికి తిరిగి వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 11:56 PM