బోసిపోయిన బొమ్మన్నపల్లి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:09 AM
పల్లెలు వలస బాటపడుతున్నాయి. వలస నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన ఉపాధి పనులు సమస్యను తీర్చడం లేదు. సకాలంలో వేతనాలు అందవనే ఉద్దేశంతో పల్లెవాసులు పట్నంబాట పట్టారు.

పిల్లాపాపలతో తెలంగాణకు 50 కుటుంబాలు
పాఠశాలలోని ఐదు తరగతులకు ఆరుగురు విద్యార్థులే హాజరు
మద్దికెర, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పల్లెలు వలస బాటపడుతున్నాయి. వలస నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన ఉపాధి పనులు సమస్యను తీర్చడం లేదు. సకాలంలో వేతనాలు అందవనే ఉద్దేశంతో పల్లెవాసులు పట్నంబాట పట్టారు. మండలంలోని బొమ్మనపల్లి ఎస్సీ కాలనీలో ఇళ్ల వద్ద వృద్ధులను వదిలేసి 50 కుటుంబాలు పిల్లా పాపలతో తెలంగాణకు వెళ్లిపోయాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతులకుగాను ఆరుగురు విద్యార్థులే ఉన్నారు. ఊళ్లో వెయ్యి మంది దాకా జనాభా ఉన్నారు. ప్రభుత్వం ఆ గ్రామంలో 150 జాబ్ కార్డులను కూడా మంజూరు చేసింది. ఎస్సీ కాలనీలో అందరూ తెలంగాణకు, అందునా హైదరాబాదుకు వలస వెళ్లారు. అక్కడ కొంత మంది చెత్తసేకరణ పనులు చేసుకొని జీవిస్తున్నారు. మరికొంత మంది వివిధవార్డుల్లో పని చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉపాధి పనుల్లో తక్కువ వేతనాలు వస్తున్నాయని, వలస వెళ్లిన చోట రోజుకు రూ.500 నుంచి రూ.700 దాకా కూలి వస్తుందని, అందువల్ల అక్కడకు వలస వెళ్లారని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రనేలలో వ్యవసాయ పనులు ముగిసిన వెంటనే వలసలు వెళ్తుంటారు. గ్రామంలో వృద్ధులు లేని ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటే పెద్దలు పిల్లా పాపలతో మూటాముల్లె సర్దుకుని తెలంగాణకు బయలుదేరి వెళ్లారు. వ్యవసాయ పనులు ముగిసిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో వలస వెళ్లడం ఆనవాయితీ. అయితే.. బొమ్మనపల్లి గ్రామంలో ప్రతి ఏడాది వలసలు వెళ్తుంటారని గ్రామస్థులు తెలిపారు. కొత్త ఇళ్లను నిర్మించుకున్నప్పటికీ గ్రామంలో ఎవరూ ఉండడం లేదు. కేవలం పండుగలకు, ఇతర కార్యాలకు మాత్రమే వస్తున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు గతంలో 170 మంది నుంచి 80 మంది హాజరయ్యేవారు. ఈ ఏడాది 5వ తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో ఒకరు, 2వ తరగతిలో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. అందరినీ ఒకే క్లాసులో కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంటికి కాపలా ఉన్నా : నాగమ్మ
నా కొడుకులు పిల్లాపాపలతో హైదరాబాదుకు పనులకు వెళ్లారు. నేను ఇంటికి కాపలా ఉన్నా. ఏదైనా జరిగితే దేవునిపైనే భారం. ఇక్కడ పనులు తక్కువగా ఉండటం వల్లే వలస వెళ్లారు. ఎప్పుడో పండుగలకు వాళ్లు వస్తారు.