‘సమగ్ర’త ఏదీ..?
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:45 PM
సమగ్ర శిక్ష నిర్వహించిన టెండర్లలో గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమగ్ర శిక్ష టెండర్లలో గోల్‌మాల్...!
ఐదు టెండర్లకు ఒకలా.. ఆరో టెండర్‌కు మరోలా
సర్దుబాటు పేరుతో అనర్హులకు అప్పగింత
ఒకే టెండర్‌ను ముగ్గురికి పంచడంపై విమర్శలు
పైగా కడప వాసులకు ఇవ్వడంపై అనుమానాలు
కోర్టును ఆశ్రయించిన బాధితులు
సమగ్ర శిక్ష నిర్వహించిన టెండర్లలో గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు 51 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సమగ్ర శిక్ష టెండర్లను పిలిచింది. అయితే అందులో ఐదింటికి ఒక రూల్, ఆరో టెండర్‌కు మరో రూల్ పాటించారన్న విమర్శలు ఉన్నాయి. ఆరో టెండర్‌కు మాత్రమే సర్దుబాటు నిబంధన అమలు చేసి అడ్డదారిలో అనర్హులకు అప్పగించిందని టెండర్‌లో పాల్గొన్న వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఒక టెండరును ఒకరికి కాకుండా మరో ఇద్దరికి కలిపి ఇవ్వడం.. అది కూడా కడప జిల్లా వాసులకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగిన టెండర్లలోనే అవకతవకలు జరగడం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై టెండర్‌లో పాల్గొన్న కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
నంద్యాల జనవరి 25, (ఆంధ్రజ్యోతి):
గత నెల 21న టెండర్ నోటిఫికేషన్
కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు గత నెల 21వ తేదీన టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అర్హులైన వారు డిపాజిట్ చెల్లించి టెండర్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత గత నెల 31వ తేదీన సదరు కమిటీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ కావడంతో ఆయన చాంబర్‌లో టెండర్లను తెరిచారు. సర్వశిక్ష పరిధిలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు సంబంధించి పిలిచిన ఆరు టెండర్లలో ఎంపిక కమిటీ ఐదు టెండర్లు తక్కువ ధరకు కోడ్ చేసిన వారికే అప్పగించింది. ఇందులో ఎక్కడా ఎలాంటి సమస్య లేదు. అయితే ఆరో టెండరు విషయంలో మాత్రమే సదరు కమిటీ సర్దుబాటు నిబంధన అమలు చేసింది. తక్కువ ధరకు
కోడ్ చేసిన వ్యక్తికే ఇవ్వకుండా అనర్హులైన మరో ఇద్దరికి కలిపి అప్పగించింది. అది కూడా టెండర్ వేసిన తొమ్మిది మందిలో తక్కువ ధరకు కోడ్ చేసిన వారి జాబితాలో ఉన్న మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తులకు కాకుండా నాలుగో వ్యక్తికి, ఆ తర్వాత ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న వ్యక్తికి కాకుండా ఏడో వ్యక్తికి కలిపి సదరు టెండర్‌ను సర్దుబాటు పేరుతో కేటాయించింది. అసలైన టెండరుదారుడితోపాటు మరో ఇద్దరిని కలిపి ఆయా స్కూళ్లను వారికి పంచి టెండర్ నియామక పత్రాలను అందజేయడం పలు విమర్శలకు తావిస్తోంది. చివరకు తక్కువ ధర కోడ్ చేసిన వ్యక్తి తనకు మాత్రమే ఇవ్వాల్సిన టెండరును మరో ఇద్దరికి కలిపి ఇవ్వడంతో షాక్ గురయ్యాడు.
టెండర్ ముగ్గురికి ఇచ్చినా..
సదరు కమిటీ సర్దుబాటు పేరుతో ఒకే టెండర్‌ను ముగ్గురికి ఇవ్వడం కూడా చర్చగా మారింది. తక్కువ ధరకు కోడ్ చేసిన కర్నూలుకు చెందిన శ్రీనివాస ట్రేడర్స్‌కు కాకుండా మరో ఇద్దరికి స్కూళ్లను విభజించి ఇచ్చింది. విషయం తెలుసుకున్న మిగిలిన ఆరుగురు టెండర్‌దారులు అభ్యంతరం తెలిపినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో వీరందరూ కలిసి న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు. టెండరు ముగ్గురికి వచ్చినప్పటికీ తక్కువ ధరకు కోడ్ చేసిన వ్యక్తి మాత్రమే ఇప్పటికీ ఆయా స్కూళ్లకు ప్రొవిజన్స్ సరఫరా చేశారని సమాచారం. మిగిలిన ఇద్దరు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వస్తుందోనని ఆందోళనతో ఇప్పటి వరకు సరఫరా చేయలేదని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
కడప జిల్లా వాసులకు ఇవ్వడంలో ఆంతర్యమేంటో..?
టెండర్ ఎంపిక కమిటీ సభ్యులుగా ఎస్‌ఎస్‌ఏ పీవో, జీసీడీవో, డీఈవో సభ్యులుగా, జాయింట్ కలెక్టర్ చైర్మన్ ఉంటారు. ఈ కమిటీ టెండర్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వారికి కాకుండా కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందులకు చెందిన కేవీఆర్ ఆగ్రోస్, శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్ వారికి సర్దుబాటు నిబంధన పేరుతో అప్పగించడం పలు విమర్శలకు తావిస్తోంది. కడప జిల్లాకు చెందిన ఆ ఇద్దరు కూడా అక్కడి ప్రజాప్రతినిధులకు సమీప బంధువులు కావడంతోనే కేటాయించారని తెలుస్తోంది. దీనికితోడు కమిటీలోని కొందరు సభ్యులు మామూళ్లు కూడా తీసుకొని ఒకే టెండర్‌ను ముగ్గురికి సర్దుబాటు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో ఇటీవల ఎంపిక చేసిన టెండర్లు.. వాటి వివరాలు..
టెండర్లలో వాటి ధరలు డిపాజిట్
రకాలు అమౌంట్
ప్రొవిజన్స్ రూ. 6,43,84,760 రూ.12,87,695
వెజిటెబుల్స్ రూ. 1,75,38,840 రూ.3,50,777
ప్రూట్స్ రూ. 96,49,200 రూ. 1,92,984
ఎగ్స్ రూ. 96,49,200 రూ. 1,92,984
చికెన్ రూ. 75,68,000 రూ.1,51,360
ఇతర వస్తువులు రూ. 9,41,400 రూ.18,840
ప్రొవిజన్స్ టెండర్‌కు కోడ్ చేసిన టెండరుదారుల వివరాలు ఇలా...
శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ - రూ. 2,71,731.04
మదీనా ట్రేడర్స్ - రూ. 2,81,845.80
ఎంఎస్ ట్రేడర్స్ - రూ. 2,84,604.04
శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్ - రూ. 2,97,970.70
హనుమాన్ ట్రేడర్స్ - రూ. 3,05,408.00
నందన ట్రేడర్స్ - రూ. 3,10,952.57
కేవీఆర్ - రూ. 3,18,234.61
లక్ష్మీప్రసాద్ - రూ. 3,70,716.00
కేవీసీఎస్ - రూ. 3,90,442.00