Share News

కొత్త బిజినెస్‌.. హోం స్టే

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:08 AM

ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ఇళ్లను కూడా లాడ్జీలుగా మార్చేస్తున్నారు. కొత్తగా హోం స్టే అనే మాట విరివిగా ప్రచారంలోకి వచ్చింది.

కొత్త బిజినెస్‌.. హోం స్టే
నాగలదిన్నె రోడ్డులో ఇంటిని హోంస్టేగా మార్చిన దృశ్యం

మంత్రాలయంలో రద్దీ పెరగడంతో లాడ్జీలుగా మారిన ఇళ్లు

పుట్టగొడుగుల్లా అనుమతి లేని లాడ్జీలు

పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నోటీసులే తప్ప.. చర్యలేవీ..?

అంతా నాయకుల అండదండలతోనే

పంచాయతీ, కుడా ఆదాయాలకు భారీ గండి

ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ఇళ్లను కూడా లాడ్జీలుగా మార్చేస్తున్నారు. కొత్తగా హోం స్టే అనే మాట విరివిగా ప్రచారంలోకి వచ్చింది. దీని కోసం పదేళ్ల నుంచి అద్దెకు ఉంటున్న వాళ్లను యజమానులు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తున్నారు. రోజువారీ అద్దె ప్రకారం భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. అద్దె ఇళ్లు కరువై స్థానికంగా పని చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ఇతర గ్రామాల నుంచి మంత్రాలయం వస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడికి మంత్రాలయానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల్లో సైతం లాడ్జీలను నిర్మిస్తున్నారు. గ్రామ పంచాయతీ, కుడా అనుమతులు కూడా తీసుకోకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి.

మంత్రాలయం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో మిగతా రోజులకంటే శనివారం, ఆదివారం, గురువారం. ఇతర సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. మంత్రాలయం పట్టనంతగా వస్తున్న భక్తులకు వసతి ఇబ్బందిగా మారింది. ప్రైవేటు, రాఘవేంద్రస్వామి మఠం గదులు సరిపోకపోవడం లేదు. రూ.400 ఉండే సాధారణ రూము అద్దె రూ.8వేలకు పెంచేశారు. గంటకు ఓ రేటు నిర్ణయించి ప్రైవేటు లాడ్జీల యజమానులు వసూలు చేస్తున్నారు. డబ్బున్నవారు వేరే వ్యాపారాలు వదిలిపెట్టి లాడ్జీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గత ఏడాది నుంచి 25 లాడ్జీలు నిర్మాణమయ్యాయి.

మంత్రాలయంలో 10,613 మంది జనాభా ఉండగా.. 3,550 గృహాలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు లాడ్జీలు 85, మరో 15 వివిద దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటిని కలిపినా ప్రైవేలుగా 500 గదులు, రాఘవేంద్రస్వామి మఠానికి చెందినవి దాదాపు 1500 గదులు ఉన్నాయి. రద్దీ సమయాల్లో ఈ గదులు ఏ మాత్రం సరిపోవడం లేదు. మంత్రాలయంలో దాదాపు 10వేల మందికి వసతి కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే 50వేల మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో లాడ్జీలకు డిమాండ్‌ పెరిగింది.

పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న లాడ్జీలు, హోం స్టేలు

మంత్రాలయంలో కుడా, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా లాడ్జీలు హోం స్టేలు పుట్టుగొడుగుల్లా పుట్టుకవస్తున్నాయి. రామచంద్రనగర్‌, రాఘవేంద్రపురం, సంత మార్కెట్‌, నాగలదిన్నె రోడ్డు, సుజీయీంద్రనగర్‌, ఓల్డ్‌ టౌన్‌లో బాడుగలకు ఉన్న వారిని ఇండ్ల నుంచి బైటికి పంపి, ఆ ఇండ్లను ప్రభుత్వ అనుమతులు లేకుండా హోంస్టేలుగా మార్చేసి బాడుగలకు ఇస్తున్నారు. ఇంట్లో మూడు గదులు ఉంటే.. రోజుకు 5వేల దాకా సంపాదిస్తున్నారు. దీనికి పంచాయతీ అనుమతులు లేవు. విద్యుత్‌, అగ్నిమాపక శాఖ, కాలుష్యం, పార్కింగ్‌ స్థలాలు లేకుండానే నడుపుతున్నారు. కొత్త కాలనీలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కాలనీ మధ్యలో ఇండ్ల యజమానులు యథేచ్ఛగా గదులను హోం స్టేగా అద్దెకు ఇస్తున్నారు. దీని వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఇబ్బందిపడుతున్నారు.

మంత్రాలయంలో పలు కాలనీల్లో బాడుగలకు ఉన్న వారిని ఖాళీ చేయించి భక్తులకు రోజువారి బాడుగలకు గదులు ఇవ్వడం పట్ల ఆగ్రహించిన మహిళలు తహసీల్దార్‌ ఎస్‌.రవికి, పోలీసులకు, టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డికి, పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు, ఈవోఆర్‌డీ ప్రభావతిదేవికి గతంలో ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదని కాలనీల ప్రజలు వాపోతున్నారు.

అనుమతులు లేని లాడ్జీలే ఎక్కువ

మంత్రాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కింగ్‌ స్థలం, ఫైర్‌, కాలుష్యం, వెలుతురు, నీరు వంటి సదుపాయాలు ఉంటేనే లాడ్జీలకు అనుమతులు ఇవ్వాలి. కానీ ఇలాంటి అనుమతులు లేకుండా, ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది.. ఆ ఇంట్లోనే గ్రౌండ్‌ ఫ్లోర్‌, జీ+2లకు అనుమతులు పొంది.. 3, 4, 5 అంతస్థుల వరకు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి నిర్మాణాలకు పాల్పడిన 18 మందికి పంచాయితీ వారు నోటీసులు జారీ చేశారు.

లాడ్జీల వాహనాలన్నీ రోడ్డుపైనే.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు

మంత్రాలయంలో ప్రైవేటు లాడ్జీలకు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో మంత్రాలయం రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేసి గదులు అద్దెకు తీసుకుంటున్నారు. రోడ్డుకిరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేయడంతోనే ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.

శ్రీమఠం గదులకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు

రాఘవేంద్రస్వామి మఠం తరపున గదులు తీసుకున్న వాహనాలకు పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు. మరో 15 ఎకరాల్లో ఎంపీడీవో కార్యాలయం వద్ద కారు పార్కింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. శ్రీమఠం తరపున పార్కింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినా ప్రైవేటు లాడ్జీల యజమానుల వల్లనే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. గత రెండు నెలల నుంచి తాత్కాలిక షెడ్లలో గదులను సుందరంగా తీర్చిదిద్ది, డబ్బు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మంత్రాలయం లాడ్జీలు, హోంస్టేలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మా కాలనీలో ఎవరు వచ్చి వెళ్తున్నారో తెలియడం లేదు

రామచంద్రనగర్‌లో మా ఇల్లు ఉంది. గత ఐదు నెలల నుంచి మా పక్కింటి వారు అద్దెకు ఉంటున్నవారిని ఖాళీ చేయించి భక్తులకు హోంస్టేగా గదులు అద్దెకు ఇస్తున్నారు. ఎవరి వచ్చి వెళ్తున్నారో.. ఏం పనులు మీద వస్తున్నారో, అక్కడేం జరుగుతోందో మాకు తెలియడం లేదు.

- బొంబాయి ఈరన్న, రామచంద్రనగర్‌ కాలనీ, మంత్రాలయం:

హోంస్టేల పేరుతో భక్తులకు గదులు ఇస్తున్నారు

హోంస్టేల పేరుతో మా పక్కింటి వారు భక్తులకు గదులు ఇస్తున్నారు.. వారు భక్తులో, ప్రేమికులో, దొంగలో మాకు తెలియడం లేదు. వారి నుంచి మాకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఇళ్లను రోజువారీ అద్దెకు ఇవ్వడం సరికాదు.

- లత గృహిణి, మంత్రాలయం

అనుమతులు తీసుకోకపోతే.. పంచాయతీ ఆదాయానికి గండి

ఇండ్లనే లాడ్జీలుగా, హోంస్టేలుగా మారిస్తే పంచాయతీ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అలా అనుమతులు తీసుకోకుంటే పంచాయతీ ఆదాయానికి గండి కొట్టి కాలనీవాసులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. వెంటనే నోటీసులు ఇచ్చి లాడ్జీలను, హోంస్టేలను తొలగిస్తాం

- ప్రభావతిదేవి, ఈవోఆర్‌డీ మంత్రాలయం

Updated Date - Mar 05 , 2025 | 12:08 AM