Share News

వలస బండి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:40 PM

సంక్రాంతి పండుగ పూర్తి చేసుకున్న ఉద్యోగులు పట్టణాలకు తిరుగుముఖం పడుతుంటే.. పల్లె వాసులు మాత్రం వలస బండి ఎక్కుతున్నారు. కర్నూలు జిల్లాకు పశ్చిమాన పల్లెలు సంక్రాంతి పండుగను చూసుకుని సుదూర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.

వలస బండి
కోసిగి మండలం కామన్‌దొడ్డి గ్రామం నుంచి గుంటూరుకు బయల్దేరిన ప్రజలు

600 కుటుంబాలు వలసబాట

60 వాహనాల్లో తెలంగాణ,

కర్ణాటక, గుంటూరుకు పయనం

కోసిగి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ పూర్తి చేసుకున్న ఉద్యోగులు పట్టణాలకు తిరుగుముఖం పడుతుంటే.. పల్లె వాసులు మాత్రం వలస బండి ఎక్కుతున్నారు. కర్నూలు జిల్లాకు పశ్చిమాన పల్లెలు సంక్రాంతి పండుగను చూసుకుని సుదూర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. తాజాగా కోసిగి మండలంలో శుక్రవారం ఒక్కరోజే సుమారు 60 వాహనాల్లో వివిధ గ్రామాల నుంచి 600కు పైగా కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వలసబాట పట్టారు. ప్రతి ఏడాది డిసెంబరు నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్థానికంగా పనులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో వలసలు సర్వసాధారణం. తల్లిదండ్రులతో పాటు చదువుకునే పిల్లలు సైతం వలసవెళ్తున్నారు.

కోసిగితో పాటు అగసనూరు, జుమాలదిన్నె, కామన్‌దొడ్డి, చింతకుంట, బోంపల్లి, డి.బెళగల్‌, కోల్‌మాన్‌పేట, ఆర్లబండ, వందగల్లు, చిర్తనకల్‌, మూగలదొడ్డి, సాతనూరు, జంపాపురం, సజ్జలగుడ్డం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు ప్రత్యేక వాహనాల్లో తెలంగాణ, కర్ణాటక, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లారు. స్థానికంగా పనులు లేకపోవడమే ప్రధాన కారణమని కూలీలు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మిరప, పత్తి తీసేందుకు పనులకు వెళ్తున్నామని కూలీలు తెలిపారు.

ప్రతి ఏటా తప్పడం లేదు

ఇప్పటి నుంచి పదేళ్ల నుంచి వలసలు వెళ్తూనే ఉన్నాం. ఆరు నెలలు మాత్రమే మాకు పనులు దొరుకుతాయి. మిగతా ఆరు నెలలు వేరే ఊర్లకు తమ పిల్లలను వెంట పెట్టుకుని గుంటూరు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాము. ఏ ప్రభుత్వం ఉన్నా మమ్మల్ని ఆదుకోరు. మా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. - లక్ష్మి, కామన్‌దొడ్డి గ్రామం

Updated Date - Jan 17 , 2025 | 11:40 PM